సోనూసూద్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే విషయం అతని సేవా కార్యక్రమాలు. కానీ ఈసారి హఠాత్తుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కారణంగా వార్తల్లో నిలిచాడు. అతని భార్య సోనాలి సూద్‌కి జరిగిన యాక్సిడెంట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ముంబై-నాగపూర్ హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో సోనాలి కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ వార్త మొదట వెలుగులోకి రాగానే ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు.
అయితే సోనూసూద్ ఆ సమయంలో కారులో లేరు. కారులో సోనాలి సూద్‌తో పాటు ఆమె సోదరి, సోదరి కుమార్తె మాత్రమే ఉన్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక భారీ ట్రక్కును సోనాలి డ్రైవ్ చేస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఎయిర్‌బ్యాగ్స్ సకాలంలో ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు వేగం తక్కువగా ఉండటంతో ప్రయాణికులెవరూ తీవ్రంగా గాయపడలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తక్షణమే సోనాలి, ఆమె కుటుంబ సభ్యులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని ముంబైలోని ప్రముఖ హాస్పిటల్‌కి రిఫర్ చేశారు. వైద్యులు అందించిన వివరాల ప్రకారం, ముగ్గురికి స్వల్ప గాయాలే అయినా, ఎలాంటి ప్రాణాపాయం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ముగ్గురు కూడా ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం.
ఈ ఘటనపై స్పందించిన సోనూసూద్ స్వయంగా తన భార్య పరిస్థితి గురించి మీడియాకు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అతను ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్నప్పటికీ కుటుంబంతో కంటాక్ట్‌లో ఉన్నాడు. సోనూసూద్ భార్యకు ఏమీ కాకపోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే కరోనా కాలంలో సోనూ చేసిన సేవల వెనుక సోనాలి పాత్ర ఉందన్నది చాలామంది గుర్తించలేని నిజం. తన భర్తకు మద్దతుగా నిలిచి, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో పాటు, సోనూ సూద్ ప్రొడక్షన్ హౌస్ వ్యవహారాల్ని చూసే వ్యక్తిగా కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.