ప్రముఖ గాయని సునీత రెండో పెళ్లికి సంబంధించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ తన రెండో పెళ్లి పై సునీత ఓ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేక్డ్ ఔట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఆయనతో జరిగిన నిశ్చితార్థం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
జనవరి 9వ తేదీన తన వివాహం జరగనుందని సునీత స్వయంగా ప్రకటించింది.ఈ రోజు ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన నూతన జీవితం బాగుండాలని స్వామి వారిని ప్రార్థించానని తెలిపింది. కరోనా విజృంభణ నేపథ్యంలో గత తొమ్మిది నెలలుగా తాను శ్రీవారిని దర్శించుకోలేకపోయానని చెప్పింది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపింది.
ఇదిలా ఉంటే, సునీతకు 19 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. కిరణ్ కుమార్ గోపరాజును పెళ్లాడారు సునీత. కొన్నేళ్ల కాపురం తర్వాత మనస్పర్థలతో వీరిద్దరూ విడిపోయారు. అప్పటికే వీరికి ఇద్దరు పిల్లలు. వాళ్ల పేర్లు ఆకాష్, శ్రేయ. ఇప్పుడు వాళ్లు పెరిగి పెద్దయ్యారు. తమ తల్లికి ఒక తోడు కావాలని కోరుకున్నారు. అందుకే, 43 ఏళ్ల వయసులో సునీత రెండో పెళ్లికి అంగీకరించారు.