ప్రతి ఒక్కరికీ తన పుట్టిన రోజు ప్రత్యేకమే. కానీ మీకు తెలుసా.. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక నెలలోనే ఎక్కువ మంది శిశువులు పుడతారని గణాంకాలు చెబుతున్నాయి. అదే సెప్టెంబర్ మాసం. ఈ నెలలోనే అత్యధిక జననాలు జరుగుతాయని అనేక దేశాల బర్త్ రికార్డులు, జనాభా సర్వేలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే అసలు ప్రశ్న ఏంటంటే.. ఎందుకు సెప్టెంబర్ లోనే ఎక్కువగా బేబీలు జన్మిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన కారణం డిసెంబర్, జనవరి నెలల్లో వచ్చే పండుగలు, సెలవులు. క్రిస్మస్, నూతన సంవత్సరం లాంటి వేడుకల సమయంలో కుటుంబాలు ఎక్కువ సమయం కలిసి గడుపుతాయి. ఆ సమయంలో వాతావరణం చల్లగా ఉండటం కూడా దగ్గరగా గడిపే అవకాశాన్ని పెంచుతుంది. ఫలితంగా ఆ నెలల్లో గర్భధారణలు ఎక్కువగా జరుగుతాయి. తొమ్మిది నెలల తర్వాత, అంటే సెప్టెంబర్‌లో బేబీ బూమ్ రూపంలో ఫలితం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే కేవలం పండుగలే కారణం కావు. వైద్య నిపుణులు చెబుతున్నట్లు, చలి కాలంలో పురుషులు, స్త్రీల శరీరాల్లో హార్మోన్ మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు సహజంగానే సంతానోత్పత్తి శక్తిని పెంచుతాయి. అందువల్ల డిసెంబర్-జనవరిలో గర్భధారణలు ఎక్కువ అవడం సహజమని చెబుతున్నారు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే.. సెప్టెంబర్ నెలలోనూ ఒక ప్రత్యేక కాలం అత్యధిక జననాలకు కారణమవుతోంది. పరిశోధనల ప్రకారం సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 21 వరకు పుట్టినరోజులు ఎక్కువగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా, యూరప్ మాత్రమే కాదు, భారతదేశం సహా అనేక దేశాల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది.
సామాజిక, సాంస్కృతిక అంశాలు కూడా ఈ జనన రేటుపై ప్రభావం చూపుతున్నాయి. పండుగలు మనుషులలో ఉత్సాహం, ఆనందం నింపుతాయి. ఆ సమయంలో జంటల మధ్య బంధం మరింత దగ్గర అవుతుంది. దీనివల్ల గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి. అందుకే సెప్టెంబర్ నెలను బేబీ బూమ్ మంత్ అని ప్రత్యేకంగా పిలుస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత చాలామంది తమ పుట్టిన రోజు కూడా ఆ జాబితాలో ఉందేమో అని ఆశ్చర్యపోతున్నారు.
