తెలుగు చిత్రసీమలోకి వచ్చిన కొంత కాలంలోనే విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు సంయుక్త. ప్రస్తుతం తెలుగుతోపాటు మలయాళ భాషల్లో వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్‌లో నటించాలంటే కష్టమన్నారు. ‘మలయాళంతో పోలిస్తే తెలుగు సినిమాల్లో నటించాలంటే చాలా కష్టం. భాష రాకపోవడం ఒక కారణమైతే.. మేకప్ మరో కారణం. వినడానికి వింతగా ఉన్నా.. నా వరకు అది చాలా పెద్ద విషయం. మలయాళ సినిమాల్లో చేసేటప్పుడు మేకప్ వేసుకోవడం వెంటనే అయిపోతుంది. చాలా లైట్‌గా, సహజంగా వేస్తారు. యాక్టింగ్ చేసేటప్పుడు కూడా పూర్తి స్వేచ్ఛ ఉన్నట్లు అనిపిస్తుంది.
కానీ, టాలీవుడ్‌లో స్వీయ జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. తెరపై ఎలా కనిపిస్తామా.. అని ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ మేకప్ వేస్తారు. షాట్ చేస్తున్నప్పుడు కూడా మేకప్‌ను చెక్ చేసుకోవాలి. ఇది సౌకర్యానికి పూర్తి విరుద్ధం. చర్మం, ముఖంపై ఏదో ఉన్నట్లు అనిపిస్తుంటుంది’ అని చెప్పారు.
ప్రస్తుతం ఆమె తెలుగులో నిఖిల్’స్వయంభూ’లో నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఇది రానుంది. సోషియో ఫాంటసీ చిత్రంగా అత్యంత భారీ బ్జడెట్‌తో రూపొందుతోంది. దీనితో పాటు శర్వానంద్‌తోనూ ఓ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రానున్న సినిమాలోనూ ఈమెను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా చిత్రీకరణ జూన్‌లో ప్రారంభం కానుంది.