RRR Movie: భారీ అంచనాల మధ్య తాజాగా విడుదలైన చిత్రం ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించి అందరికీ తెలిసిందే. కొన్ని కోట్ల మంది ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇప్పుడు భారీ కలెక్షన్స్ ని కూడా వసూళ్లు చేస్తుంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు అగ్ర పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా, రిలీజ్ అనంతరం ఈ చిత్రం అశేష అభిమానుల్ని సంపాదించుకుంటోంది. ఇద్దరు స్టార్ హీరోస్ నటించడం ఈ సినిమాకు మరో ప్లస్ అవడంతో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సంబరలు చేసుకుంటున్నారు.
ఇకపోతే దాదాపు అన్ని చోట్లా మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్న ఈ సినిమాకు కర్ణాటక మాత్రం కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాపై స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. పలు భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మూవీ టీమ్ సైతం వివిధ రాష్ట్రాల్లో తిరిగి ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా కర్ణాటకలో ఇప్పటికే భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న జేమ్స్ సినిమాపై ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రభావం పడిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నేపథ్యంలో జేమ్స్ సినిమాను దాదాపు 270 థియేటర్లలో తీసేయడం పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు అసంతృప్తిని కలిగిస్తోంది. దీంతో బాయ్ కాట్ ఆర్ ఆర్ ఆర్ అనే హాష్ టాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. మరో వైపు తెలుగు అభిమానులు బాయ్ కాట్ కేజీఎఫ్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పటికే జేమ్స్ సినిమా తొలి వారం రోజుల్లోనే రూ.150 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించగా, అంత పాపులారిటీతో దూసుకు పోతున్న సినిమాను పక్కన పెట్టేసి ఆర్ ఆర్ ఆర్ సినిమాను వేయడంపై పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య, హీరో శివ రాజ్ కుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. దీన్ని పలు రాజకీయ పార్టీలు సైతం వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ విషయంలో తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే, ఇప్పటికే బాగా ఆడుతున్న సినిమాను ఎలా తీసేస్తారు అని శివ రాజ్ కుమార్ ఆగ్రహించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వేరే భాష సినిమా కోసం సొంత భాషా సినిమాను ఎలా పక్కన పెడతారు అని ఆయన ఫిల్మ్ ఛాంబర్ పెద్దలపై కూడా మండిపడ్డట్టు సమాచారం. అన్ని చోట్లా మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్, కర్ణాటకలో మాత్రం కొన్ని వివాదాలకు తావివ్వడంపై పలువురు బాధను వ్యక్తం చేస్తున్నారు.