దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన అధ్భుత దృశ్య కళాఖండం ఆర్ఆర్ఆర్ సినిమా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తం అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం సూపర్ డూపర్ హిట్టుగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటీవలే ఈ సినిమా, ఇందులోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది.
దీంతో జపాన్ లో గత కొంత కాలంగా కొనసాగుతున్న ఆర్ఆర్ఆర్ దండయాత్ర మరింతగా దూసుకెళ్తోంది. ఆస్కార్ ఎఫెక్ట్ తో జపాన్ లోని థియేటర్లన్నీ ఆర్ఆర్ఆర్ అభిమానులతో కిక్కిరిసిపోతున్నాయి. 14 వారంలోనూ భారీ వసూళ్లను రాబడుతూ.. బాక్సాఫీసును కొల్లగొడుతున్నాయి. 100 రోజుల వ్యవధిలోనే 43 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ప్రభంజనం సృష్టించింది. సినిమా విడుదలైన మొదటి వారంలోనే 81 మిలియన్ యెన్స్ ను సొంతం చేసుకుంది. అలాగే రెండో వారం 72 మిలియన్ యెన్స్ ను రాబట్టింది.
మూడో వారం 65 మిలియన్ యెన్స్, 4వ వారం 45 మిలియన్ యెన్స్, ఐదో వారం 50 మిలియన్ యెన్స్, ఆరోవారం 48 మిలియన్ యెన్స్, ఏడో వారం 28 మిలియన్ యెన్స్, ఎనిమిదో వారంలో 26 మిలియన్ యెన్స్, తొమ్మిదో వారం 21 మిలియన్ యెన్స్, పదో వారం 28 మిలియన్ యెన్స్, పదకొండో వారం 31 మిలియన్ యెన్స్, పన్నెండో వారం 27 మిలియన్ యెన్స్ , పదమూడో వారం ఏకంగా 72 మిలియన్ యెన్స్, అదే పద్నాలుగో వారం 120 మిలియన్ యెన్స్ ను సాధించి వసూళ్ల వేటలో దూసుకెళ్తోంది.
రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కెలక్షన్లను సొంతం చేసుకొని భారీ వసూళ్లను రాబడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందులోనా ఆస్కార్ కు ఎంపికవడంతో రోజురోజుకూ ఈ సినిమాను చూసే వారి సంఖ్య పెరిగిపోతోంది. అక్టోబర్ 21న విడుదల అయిన ఈ సినిమాలో కొన్ని సీన్లను చూస్తూ అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బ్రిడ్జి సీన్ కి సంబంధించిన ఓ ధియేటర్ లో.. అభిమానులు గోల గోల చేస్తూ.. ఈలలు వేస్తూ ఎంజాయ్ చేసే వీడియో వైరల్ అయింది. అది చూస్తేనే సినిమాను జపనీస్ ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో అర్థం అవుతోంది.