IPL 2025: బెంగళూరు బుల్లెట్: పంజాబ్‌ను చిత్తుచేసి ఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ!

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ గేర్‌లో దూసుకెళ్లింది. చంఢీగడ్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ జయంతో ఆర్సీబీ నేరుగా ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది. స్వల్ప లక్ష్యాన్ని పైనల్ స్టెయిల్‌లో ఛేదించి మరోసారి టైటిల్ కలను నిజం చేసేందుకు తుది పోరుకు రెడీ అయింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 14.1 ఓవర్లలో కేవలం 101 పరుగులకే ఆలౌటైంది. ఆరంభం నుంచే బెంగళూరు బౌలర్లు విజృంభించడంతో పంజాబ్‌ కుదేలు అయింది. మార్కస్ స్టాయినిస్ (26), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18), ఒమర్జాయ్ (18) కొంత సమయానికి పోరాడినా మిగిలిన ఆటగాళ్లు నిలదొక్కుకోలేకపోయారు. ఇంపాక్ట్ ప్లేయర్ ముషీర్ ఖాన్ డకౌట్ కాగా, నేహల్ వధేరా (8), శశాంక్ సింగ్ (3), జోష్ ఇంగ్లిస్ (4) నిరాశపరిచారు.

ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ (3/18), జోష్ హేజిల్‌వుడ్ (3/14) విజృంభించగా, యశ్ దయాళ్ (2/11), భువనేశ్వర్ కుమార్ (1/12), రొమారియో షెఫర్డ్ (1/19) అద్భుతంగా రాణించారు. టాప్ ఆర్డర్‌ను శిథిలం చేసి మ్యాచ్‌ను ఒక్క దశలోనే తమ వశం చేసుకున్నారు.

లక్ష్యం చిన్నదైనా పంజాబ్‌పై కన్ఫిడెంట్‌గా బరిలోకి దిగిన బెంగళూరు.. 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (56*; 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫస్ట్ క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకోగా, మయాంక్ అగర్వాల్ (19), విరాట్ కోహ్లీ (12), రజత్ పటిదార్ (15*) అనుసరించారు. ఆర్సీబీ ఈ సీజన్‌లో నిలకడగా రాణించుతూ బలంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఫైనల్‌లో టైటిల్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి.