ఐపీఎల్ 2025 సీజన్ లీగ్ దశకు ఘన ముగింపు పలుకుతూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. సోమవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. భారీ లక్ష్యాన్ని బెంగళూరు దూకుడుగా చేధించడం విశేషంగా నిలిచింది.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే కోహ్లీ (54: 30 బంతుల్లో 10 ఫోర్లు) – ఫిల్ సాల్ట్ (24) జంట విజృంభించి వేగంగా స్కోరు పరుగులు తీసింది. సాల్ట్ అవుటైన తర్వాత కొంత తడబాటుకు లోనైన ఆర్సీబీ పటిదార్ (14), లివింగ్‌స్టన్ (0) వికెట్లు కోల్పోయింది. అయితే, అప్పుడు వచ్చిన జితేశ్ శర్మ (85*: 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులు), మయాంక్ అగర్వాల్ (41*: 23 బంతుల్లో 5 ఫోర్లు) కలిసి మ్యాచ్‌ను పూర్తి జోరుగా ముగించారు.
ముఖ్యంగా జితేష్ కు మధ్యలో ఒక నో బాల్ తో ఒకసారి లైఫ్ లభించింది. అతడి ఆటకు పంత్ మైండ్ బ్లాక్ అయ్యింది. ఫీల్డింగ్ లో ఎన్ని మార్పులు చేసినా వర్కౌట్ కాలేదు. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ తరఫున రిషబ్ పంత్ (118*: 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సులు) ఒంటరి పోరాటం చేసి జట్టుకు 227/3 భారీ స్కోరు అందించాడు. మార్శ్ (67), పూరన్ లు సహకరించారు. బౌలింగ్‌లో ఆర్సీబీ భువనేశ్వర్, తుషారా, షెపార్టీ ఒక్కొక్క వికెట్ తీసారు.
ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న పంజాబ్‌తో బెంగళూరు జూన్ 29న క్వాలిఫయర్-1లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి చేరుతుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2లో మరో అవకాశం ఉంది. ఇక జితేశ్ శర్మ ఇన్నింగ్స్ మాత్రం అభిమానులను ఊపేసింది.