బీసీల రిజర్వేషన్లపై ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఆందోళన.. కేంద్రంపై ఘాటు విమర్శలు..!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల హక్కుల కోసం ఉద్యమం జోరుగా సాగింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా దేశవ్యాప్తంగా రాజకీయ దృష్టిని ఆకర్షించింది. బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతో కేంద్రాన్ని కదిలించాలన్న లక్ష్యంతో ఈ పోరుబాట ప్రారంభమైంది.

ధర్నా వేదికపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసింది. కానీ కేంద్రం ఆ బిల్లును ఇప్పటికీ రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా ఆలస్యం చేస్తోందన్నారు.. ఇది బీసీలను అవమానించడమే కాదు, వారి భవిష్యత్తును కాసే కుట్ర అని ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్ల కోసం తమ పోరాటం ఆగదని, ఆ బిల్లు ఆమోదం పొందే వరకూ తాము నిద్రపోమని స్పష్టం చేశారు.

గతంలో కేసీఆర్ చేసిన రిజర్వేషన్ చట్టం బీసీల హక్కులకు గుదిబండగా మారిందన్న రేవంత్ రెడ్డి. బలహీన వర్గాల నుంచి వచ్చిన వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హత లేని వారిగా మార్చేలా ఉందన్నారు. అందుకే మేము ఆ చట్టాన్ని తొలగించేందుకు ఆర్డినెన్స్ ద్వారా మార్గం సిద్ధం చేశాం. అయితే గవర్నర్ ఆ ఆర్డినెన్స్‌ను ఆమోదించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి ఎంపీలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. డీఎంకే, సమాజ్‌వాది పార్టీ, వామపక్షాలు, ఎన్సీపీ వంటి పార్టీలు సంఘీభావం తెలిపారు. తెలంగాణలో ధర్నా చేస్తే స్థానిక రాజకీయ పార్టీలు మాత్రమే స్పందిస్తాయి. కానీ ఢిల్లీలో ధర్నా చేస్తే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందుకే మేము జంతర్ మంతర్‌ను ఎంచుకున్నాం అని రేవంత్ వివరించారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే కేంద్రానికి గుణపాఠం చెబుతామన్నారు.. తెలంగాణ గల్లీల బీజేపీ నేతలను తాను ఎదుర్కొంటానని.. మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును వెంటనే ఆమోదించాలన్నారు. లేకపోతే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు తనకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఇక ఈ ఉద్యమంలో టీఆర్ఎస్ నేతలు పాల్గొనకపోవడంపై కూడా రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం గ్రామాలపై ఆధారపడే జీవితం గడుపుతోందన్న రేవంత్. అధికారాన్ని కోల్పోయినా కేటీఆర్ కు ఇంకా బుద్ధి రాలేదన్నారు. బీసీల హక్కులను అడ్డుకుంటూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న వారిని ప్రజలు గమనించాలంటూ పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిసిసి నేతలు, బీసీ సంఘాల నేతలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.