పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణూ దేశాయ్ తెలుగు సినీ ప్రేక్షకులందరికీ తెలిసిందే. అది మాత్రమే కాకుండా రేణూ దేశాయ్‌లో ఎంతో ప్రతిభ ఉందని కొందరికి మాత్రమే తెలుసు. రచయితగా, కవిగా, దర్శకురాలిగా, క్యాస్టూమ్ డిజైనర్, ఫోటోగ్రఫర్‌గా ఎన్నో వాటిలో నైపుణ్యం ఉందన్న సంగతి కొందరికే తెలుసు. అయితే చిన్న తనంలో రేణూ దేశాయ్ ఎలాంటి కలలు కన్నదో తెలిస్తే షాక్ అవుతారు.

‘1995 సెప్టెంబర్ 9, నేను కెమెరాను ఫేస్ చేసి ఇప్పటికి 25 ఏళ్లు గడిచాయి. మామూలుగా అయితే చిన్నప్పటి నుంచి స్పేస్ సైంటిస్ట్ లేదా న్యూరో సర్జన్ అవుదామని కలలు కన్నాను. నాకు వచ్చే మార్క్స్ కూడా అంతే స్థాయిలో వచ్చేవి. కానీ విధి ఊహించని మలుపులను తిప్పుతుంది. నేను అనుకోకుండా నా పదహారేళ్ల వయసులో కెమెరాను ఫేస్ చేశాను. ఇక అప్పుడు ఫిల్మ్ మేకింగ్ ప్రేమలో పడిపోయాను. అప్పటి నుంచి జరిగిన చరిత్ర మీకు తెలిసిందే.

నాసాలో చేరాలని, స్పేస్ సైంటిస్ట్ అవ్వాలన్న కోరికను ఆ వయసులో పక్కనపెట్టడం ఎంతో బాధగా అనిపించింది. ఆ బాధ నన్ను ఎన్నో యేళ్లు వెంటాడింది. ఇక ఫిల్మ్ మేకింగ్‌పై పెరిగిన నా ప్రేమతో.. ఫిజిక్స్, గణితంపై ఉన్న ప్రేమ శాంతించింది. దర్శకుడిగా కూడా నేను స్టార్స్‌నే డీల్ చేస్తాను. కాకపోతే కాస్త భిన్నంగా ఉంటాయి. మీ మనసును మీరు నమ్మండి.. కష్టపడండి.. మీకు కచ్చితంగా విజయం సమకూరుతుందని నేను గ్యారెంటీ ఇస్తున్నాను. అంటూ తన జీవితంలోని మొదటి ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
