టాలీవుడ్‌లో పెద్ద సినిమాల రిలీజ్ షెడ్యూల్ ఇప్పుడు అసలైన తలనొప్పిగా మారింది. ఒకప్పుడు రిలీజ్ డేట్ అనగానే జోష్ పెరిగే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల దగ్గరే అస్థిరత నెలకొనడంతో, చిన్న సినిమాల నిర్మాతలకూ సందిగ్ధత తప్పట్లేదు. ఈ గందరగోళానికి కారణం పోస్టు ప్రొడక్షన్‌లో జాప్యమేనన్న మాట వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా తొలి నుంచి జనవరి రిలీజ్ అని ప్రచారం జరిగింది. అయితే సీజీ వర్క్ పూర్తవ్వకపోవడంతో ఆ ప్లాన్ బోల్తా పడింది. ఇప్పుడు కొత్త డేట్లు బయటకొస్తున్నా, అధికారికంగా ఏమీ వెల్లడించకపోవడం వల్ల ఫ్యాన్స్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అదే పరిస్థితి ప్రభాస్ ‘రాజాసాబ్’ చిత్రానికి కూడా వర్తిస్తోంది. షూటింగ్ ముగిసినట్టు తెలిసినా, రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేకపోవడం గమనార్హం.
ఇదే బాటలో తేజ సజ్జా ‘మిరాయ్’, అనుష్క ‘ఘాటీ’, రవితేజ ‘మాస్ జాతర’ సినిమాలూ ఉన్నాయ్. షూటింగ్ పూర్తయినా, ప్రమోషన్‌కు సిద్ధంగా ఉన్నట్టే అనిపించినా, డేట్ మాత్రం ఖరారు కావడం లేదు. నిర్మాతలు ఆంతరంగికంగా పరిస్థితిని విశ్లేషిస్తున్నా, బహిరంగంగా అప్‌డేట్ ఇవ్వడం లేదు.
ఈ అస్పష్టత వల్ల టైర్-2, టైర్-3 హీరోల సినిమాల విడుదలకి ప్లానింగ్ చేసుకోవడం కష్టంగా మారింది. పెద్ద సినిమాల డేట్ ప్రకటన లేకుండా ఉండిపోతే, చిన్న సినిమాలకు బజ్ పెరగదు. మొత్తానికి, భారీ సినిమాల రిలీజ్ డేట్‌లపై క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఇండస్ట్రీలో స్థిరత, ప్రేక్షకుల్లో ఆసక్తి పునరుద్ధరమవుతాయి.