షూటింగ్‌ తదితర సమస్యలతో విడుదలలో ఆసల్యం

రానున్న నెలల్లో తెలుగు ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూసే సినిమాలు చాలానే వున్నాయి. రామ్‌ పోతినేని, పూరి జగన్‌ కాంబినేషన్‌ లో వస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, ఎన్టీఆర్‌, కొరటాల శివ చేతులు కలిపిన ‘దేవర’ పార్టు వన్‌, అల్లు అర్జున్‌ తో దర్శకుడు సుకుమార్‌ చేస్తున్న ‘పుష్ప 2’ ఇంకా ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడి’. ఇందులో కొంచెం బడ్జెట్‌ ఎక్కువ వున్న సినిమాలు వున్నాయి, సీక్వెల్స్‌ వున్నాయి.

పైన చెప్పిన సినిమాలు అన్నీ విడుదల తేదీలు అధికారికంగా ప్రకటించారు, ఇంకా రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌ లో వస్తున్న ‘గేమ్‌ చెంజర్‌’ విడుదల తేదీ ప్రకటించలేదు కానీ.. ఆ సినిమా కూడా ఈ సంవత్సరమే విడుదలవుతుంది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలన్నీ విడుదల తేదీలు ప్రకటించినా ఈ సినిమాలన్నీ వాయిదా పడే అవకాశం వుందని అంటున్నారు.

పూరి జగన్‌, రామ్‌ పోతినేని సినిమా ఇంకా షూటింగ్‌ చెయ్యాల్సి ఉందని, అదీ కాకుండా ఆ సినిమాకి కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ విలన్‌ గా నటిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటిటి, శాటిలైట్‌ హక్కులు ఇంతకు ముందులా పోవటం లేదని, అది కూడా ఒక కారణం అని అంటున్నారు. అందుకని ఈ సినిమా మార్చి నుండి వేసవి సెలవుల్లో విడుదల ఉండొచ్చు అని అంటున్నారు. దీనివిూద ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఇక ఎన్టీఆర్‌, కొరటాల శివ సినిమా ‘దేవర’ కూడా చాలా షూటింగ్‌ మిగిలి ఉందని, ఈ సినిమాకి ముఖ్యంగా కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ పని చాలా ఉందని అందుకని ఈ సినిమా అనుకున్న తేదీకి రాకపోవచ్చు అని అంటున్నారు. ఈమధ్యనే ఇందులో విలన్‌ గా నటిస్తున్న బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ గాయాల పాలై ఆసుపత్రిలో చేరారు. అతను కోలుకొని మళ్ళీ సెట్స్‌ కి రావటానికి కొంచెం టైము పడుతుంది అని, అప్పుడు షూటింగ్‌ లో డిలే ఉండొచ్చు, అందుకని సినిమా విడుదల వాయిదా వేయడానికి అవకాశం ఉందని అంటున్నారు.

ఇక ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ‘కల్కి 2898 ఏడి’ అనే సినిమాకు కూడా ఇంకా చాలా గ్రాఫిక్‌ పని వుంది, షూటింగ్‌ కూడా కొంచెం చెయ్యాల్సి వుంది అని వార్తలు వస్తున్నాయి. అందుకని ఈ సినిమా కూడా అనుకున్న తేదీకి కాకుండా వాయిదా పడే అవకాశం వుంది అని అంటున్నారు.

ఇది పాన్‌ ఇండియన్‌ సినిమాగా విడుదల అవుతుంది కాబట్టి, ఈ సినిమాకి హిందీ సినిమాలు ఏవిూ పోటీ లేకుండా వున్న తేదీని చూసి విడుదల చేస్తారు అని అంటున్నారు. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకోనే , దిశా పటాని, దుల్కర్‌ సల్మాన్‌ లాంటి చాలామంది స్టార్స్‌ నటిస్తున్నారు. ఇంకా రానా దగ్గుబాటి కూడా వున్నారు అని అంటున్నారు.

షూటింగ్‌ కూడా చెయ్యాల్సింది ఉందని అందుకని ఈ సినిమా వాయిదా పడే అవకాశం వుంది అని చెబుతున్నారు. ఇక ‘పుష్ప 2’ షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. దర్శకుడు సుకుమార్‌ తాను అనుకున్న అవుట్‌ ఫుట్‌ సరిగా వచ్చేవరకు తీస్తాడు. విడుదల తేదీ ప్రకటించేసాం కదా అని తొందరగా తీసే స్వభావం కాదు అతనిది. ఇంకా చాలా షూటింగ్‌ చెయ్యాల్సి వుందని అంటున్నారు.

సినిమా మొత్తానికి హైలైట్‌ గా ఉండబోతున్న గంగమ్మ జాతర పాట ఒక్కటే సుమారు ఒక నెల రోజుల పాటు చిత్రీకరించారని తెలిసింది. అదీ కాకుండా నీళ్లలో ఒక పోరాట సన్నివేశం ఉందని, దానికి హోమ్‌ వర్క్‌ చెయ్యడమే నెల రోజులు అయిందని, దానికి యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వంలో చేశారు అని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పోరాట సన్నివేశం చిత్రీకరించాల్సి వుంది.

ఇక ఈ సినిమాలో కేశవ పాత్ర చేసిన జగదీశ్‌ అరెస్టవటంతో అతనితో చెయ్యాల్సిన సన్నివేశాలు డిలే అయ్యాయని కూడా తెలిసింది. అతను బయటకి వచ్చాడు, అతని విూద సన్నివేశాలు తీయాల్సి ఉందని అంటున్నారు. రష్మిక మందన్న ఇంకా పూర్తిగా ఈ సినిమా షూటింగ్‌ లో పాల్గొనలేదని, ఆమె విూద చిత్రీకరించాల్సింది చాలా ఉందని అంటున్నారు.

అలాగే పాటలు కూడా చిత్రీకరించాలి. అందుకని అనుకున్న విధంగా ఆగస్టు 15కి రాలేరని పరిశ్రమలో టాక్‌ నడుస్తోంది. ఇలా అన్ని సినిమాలు విడుదల తేదీల్లో మార్పులు ఉండొచ్చు అని పరిశ్రమలో కొన్ని రోజుల నుండి చర్చ జరుగుతోంది. అలాగే సామజిక మాధ్యమాల్లో కూడా ఈ సినిమాలు విడుదల తేదీలు గురించి చాలా చర్చ వైరల్‌ అవుతోంది.