విక్రమార్కుడు సినిమాలో తాను చేసేటందుకు ఆ క్యారెక్టర్‌లో లీనమయ్యేటట్టు డైరెక్టర్ గారు, మరో పక్క హీరో రవితేజ కూడా తనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని ప్రముఖ ఆర్టిస్ట్ జయవాణి తెలిపారు. రవితేజ తనను వెతుక్కుంటూ వచ్చి జయవాణి ఎవరు.. జయవాణి ఎవరు .. అని, ఇద్దరం నిజంగా ఫైట్ చేసుకుందాము. నువ్వు కొట్టు. నేను కూడా కొట్టినట్టే నటిస్తానని, మీరేం ఫీలవకండి.. నేను కూడా ఏం ఫీల్ కానని రవితేజ తనతో అన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. అలా చెప్పడంతో నిజంగానే ఆ సీన్‌లో కొట్టుకున్నామని, ఆయన జుట్టు ఊడి కొంచెం తన చేతిలోకి కూడా వచ్చిందని జయవాణి చెప్పారు.
ఇకపోతే హీరో శ్రీకాంత్ అంటే కూడా తనకు చాలా ఇష్టమన్న ఆమె, నిజంగానే ఆయన బయట కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ప్రస్తుతం కూడా అలానే ఉన్నారని, ఆయనలో ఏ మాత్రం మార్పు రాలేదని జయవాణి అన్నారు. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్న జయవాణి, ఆయన్ను చూసి చాలా నేర్చుకోవాలని ఆమె తెలిపారు. అలా ఎప్పుడూ ఒకలా ఉండడం అందరికీ సాధ్యం కాదని, ఆ ప్రవర్తన శ్రీకాంత్‌లో ఉండడం నిజంగా చాలా చెప్పుకోదగ్గ విషయమని ఆమె అన్నారు.
అంతకుముందు డైరెక్టర్ తన దగ్గరికొచ్చి ఏం చెప్పలేదు. కానీ ఓ సినిమాలో తన్నే సీన్ ఉంది చేస్తావా అని తనను అడిగినపుడు, మీరేం చెప్తే అది చేస్తానని అన్నానని జయవాణి తెలిపారు. వెంటనే ఆయన హీరోను తన్నాలి.. తంతావా ? అని అడిగితే, తాను దానికి సమాధానంగా మీరు చెప్తే తంతాను సర్. అని అన్నట్లు ఆమె వివరించారు. అక్కడ ఎవరున్నారు అనేది కాదు కదా చూసేది.. డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాలి కదా అని ఆమె సమర్థించుకున్నారు. వెంటనే అక్కడ ఉన్న శ్రీకాంత్‌ని పిలిచి ఈవిడ తంతదంట అని చెప్పినపుడు, అసలు ఇది నిజమా, లేదంటే జోక్ చేస్తున్నారా అర్థం కాలేదని ఆమె చెప్పారు.