నాకు రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌.. పార్టీ ప్ర‌క‌ట‌న‌పై ఆల‌స్యానికి కార‌ణం ఇదే అన్న ర‌జ‌నీకాంత్

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టుడిగా ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కేవ‌లం మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లోను ర‌జ‌నీకాంత్‌కు లెక్క‌కి మించిన అభిమానులు ఉన్నారు. అయితే ఆయ‌న రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశంపై గ‌త కొన్నాళ్ళుగా ఆస‌క్తి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఎప్పుడు ర‌జ‌నీకాంత్ పార్టీ ప్ర‌క‌ట‌న చేస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు వైపు ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నప్పటికీ రజనీకాంత్ కొత్తపార్టీ ఏర్పాటుపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డంతో అభిమానులు క‌ల‌త చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న అభిమానుల‌ను ఉద్దేశించి ర‌జనీకాంత్ రాసిన లేఖ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అభిమానులు, ప్ర‌జ‌లే నా దేవుళ్ళు. వారికి నిజాలు చెప్పాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశంతోనే నేను రాజ‌కీయ పార్టీ ప్రారంభించాల‌ని అనుకున్నాను. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేశాను. మదురైలో అక్టోబర్ 2న భారీసభ నిర్వహించి పార్టీ పేరు జెండా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ అదే సమయంలో కరోనా ఎంట‌ర్ కావ‌డంతో విర‌మించుకున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం అంత‌గా బాగోలేదు. 2011లో కిడ్నీ సమస్య తో బాధ‌ప‌డ్డ నేను సింగ‌పూర్‌లో వైద్యం చేయించుకున్నాను. 2016లో ఆ స‌మ‌స్య మ‌ళ్ళీ రావ‌డంతో అమెరికా వెళ్లి మార్పిడి చేసుకున్నా. ఈ విష‌యం నా స‌న్నిహితుల‌కు మాత్ర‌మే తెలుసు.

నాకు కిడ్నీ మార్పిడి జ‌ర‌గ‌డం వ‌ల‌న రోగ నిరోధ‌క శ‌క్తి చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అందువ‌ల‌న ఎవరిని క‌ల‌వ‌డానికి వీలు లేకుండా పోయింది. వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందో తెలియ‌డం లేదు. ప్రాణ‌భ‌యం నాకు లేదు కాని న‌న్ను న‌మ్ముకున్న వాళ్ల కోస‌మే ఆలోచిస్తున్నా. పార్టీ పెట్టాలంటే బ‌హిరంగ స‌భలు త‌ప్ప‌నిస‌రి. సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌చారం స‌రిపోదు. దీంతో నేను ఆశించిన రాజకీయవిప్లవాన్ని సాధించలేను. ఇప్పుడు ఈ విష‌యాన్ని చెప్ప‌డానికి కార‌ణం నా అభిమానులు నా రాజ‌కీయ ఆరంగేట్రం కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. వారికి క్లారిటీ ఇవ్వాల‌నే ఉద్దేశంతోనే ఈ లెట‌ర్ విడుద‌ల చేస్తున్నా.

రాజ‌కీయ పార్టీ ప్రారంభించే ఆలోచ‌న ఉంటే జ‌న‌వ‌రి 15 లోపే మొద‌లు పెట్టాలి. అంటే డిసెంబ‌ర్‌లో నిర్ణ‌యం తీసుకోవాలి. నా రాజకీయ ఎంట్రీ కోసం నేను సుధీర్ఘంగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటాను. నా నిర్ణ‌యానికి అభిమానులు మ‌ద్ద‌తు తెల‌పాలి అంటూ ర‌జ‌నీకాంత్ రాజసిన సుదీర్ఘ లేఖ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. అయితే ఈ విషయ గురించి త‌మ‌కేం తెలియ‌ద‌ని ర‌జనీ అభిమాన సంఘాల నేతలు అంటున్నారు.