ర‌జ‌నీకాంత్ ఇంటి ముందు అభిమాని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. !

కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ర‌జ‌నీకాంత్ డిసెంబ‌ర్ 31న త‌న పార్టీకు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. కాని అనారోగ్యం, ప్ర‌స్తుత ప‌రిస్థితుల వ‌ల‌న తాను రాజ‌కీయాల‌లోకి రావ‌డం లేద‌ని మూడు పేజీల ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపాడు. ర‌జ‌నీకాంత్ ప్ర‌క‌ట‌న‌ల‌తో అభిమానుల ఆశ‌లు ఆవిరి అయ్యాయి. చాలా మంది నిరాశ చెందారు. ఇన్నాళ్లు త‌మ అభిమాన న‌టుడిని సీఎం పీఠంపై చూస్తామ‌ని క‌న్న క‌ల‌లు నీరు కారాయి. ఏం చేయాలో తెలియ‌ని అభిమానులు పిచ్చెక్కిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇన్నాళ్ళు దేవుడిలా పూజించగా, ఇప్పుడు ఆయ‌న ఫొటోల‌ని కాల్చేస్తున్నారు. దిష్టిబొమ్మ‌లు త‌గ‌ల బెడుతున్నారు.

అయితే తాజాగా ర‌జ‌నీకాంత్ నిర్ణ‌యంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసి ఓ అభిమాని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. ర‌జ‌నీకాంత్ త‌న నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేస్తూ మురుకేస‌న్ అనే వ్య‌క్తి నిప్పంటించుకొని ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించాడు. అతనికి తీవ్ర‌గాయాలు కాగా, ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల‌లోకి రాడు అన్న విష‌యాన్ని అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. ర‌జ‌నీకాంత్ ఇంటి ఎదుట నిర‌స‌న‌లు, ర్యాలు చేస్తూ ఆ వాతావ‌ర‌ణం ఉద్రిక్తంగా మారేలా చేస్తున్నారు.

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల‌లోకి వ‌ద్దామ‌ని అనుకున్న స‌మ‌యంలో ఆయ‌న అధిక రక్త‌పోటు కార‌ణంగా మూడు రోజుల పాటు జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందారు. వైద్యులు అన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించి అంతా నార్మ‌ల్‌గానే ఉన్నాయ‌ని తేల‌డంతో డిశ్చార్జ్ చేశారు. అయితే ర‌జ‌నీకాంత్ త‌న కూతుళ్ళు, కొంద‌రు స‌న్నిహితులు సూచ‌న‌ల ప్ర‌కార‌మే రాజ‌కీయాల నుండి త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ర‌జ‌నీకాంత్ నిర్ణయాన్ని లారెన్స్, మోహ‌న్ బాబు వంటి సెల‌బ్స్ స్వాగ‌తించారు.