Rajamouli: సీఎంతో భేటీ అనంతరం ఆసక్తికరమై వ్యాఖ్యలు చేసిన రాజమౌళి…ఏమన్నారంటే?

Rajamouli: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్దమైన విషయం అందరికీ తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో కలిసి నటిస్తున్న ఈ సినిమాకు రిలీజ్‌కు ముందునుంచే వస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. వెండితెరపై మ్యాజిక్‌ను సృష్టించే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించగా నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్పటివరకు పలు కారణాల వల్ల పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈనెల 25న విడుదలకు సిద్ధమవుతుండడంతో ఒక పక్క మెగా అభిమానులు, మరో పక్క నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఇంతకు మునుపే సినిమా టికెట్ల ధరల విషయంలో సినీ పెద్దలు సీఎంను కలిసి చర్చించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే టికెట్ల ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంతో పాటు డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా వంద కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలు, ఏపీలో 20శాతం షూటింగ్ జరుపుకుంటే పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ సినిమాకు ఈ నిబంధనలు వర్తించడంతో అదనపు షోలు కూడా పడ్డాయి.

అయితే సీఎం జగన్‌తే భేటీ అయిన తర్వాత రాజమౌళి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్న రాజమౌళి, భారీ బడ్జెట్ మూవీ కావడంతో అవసరమైన చర్యులు తీసుకుంటామని, ప్రయోజనాలు చేకూరేలా ఆలోచిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఇక బెన్‌ఫిట్ షోల గురించి ఇంకా ఏం తెలియదని ఆయన చెప్పారు. ఇప్పటికే అత్యధికంగా రూ.275 గా టికెట్ ధరలను ఏపీ ప్రభుత్వ నిర్ణయించగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఉండడం, రాజమౌళితో చర్చలు అన్నీ కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ విషయంలో ఎలాంటి మినహాయింపులిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఆర్ఆర్ఆర్ సినిమా స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరు సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా తెరకెక్కించినది కావడంతో వినోదపు పన్ను మినహాయింపు కోరతారా లేక మరిన్ని అదనపు షోలకు పర్మిషన్ తీసుకుంటారనే ఆనేదానిపై చర్చ జరుగుతోంది.