రాధేశ్యామ్ కాన్సెప్ట్ చెప్పిన స‌చిన్.. ఊహ‌ల్లో విహ‌రిస్తున్న ఫ్యాన్స్

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రాల‌లో రాధే శ్యామ్ ఒక‌టి.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్, మంగుళూరు సోయ‌గం పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లాక్‌డౌన్ కార‌ణంగా ఆరు నెల‌ల ఆగిపోయింది. అక్టోబ‌ర్ మొద‌టి వారం నుండి చిత్ర షూటింగ్ ఇటలీలో తిరిగి ప్రారంభం కాగా, మ‌రి కొద్ది రోజుల‌లో వారు ఇండియాకు రానున్నారు.

భారీ అంచ‌నాల‌తో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ చిత్రం వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ , వీడియోస్ సినిమాపై అంచనాల‌ని రెట్టింపు చేస్తున్నాయి. రీసెంట్‌గా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ పేరుతో విడుదలైన వీడియో రికార్డుల‌ని తిర‌గ‌రాసింది. ఇందులో ప్ర‌భాస్, పూజా హెగ్డే లుక్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఉర‌క‌లెత్తేలా చేసింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ ఏ నేప‌థ్యంలో సాగుతుంది అనే డౌట్ అభిమానుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల మ‌దిని తొలుస్తుంది. ఈ నేప‌థ్యంలో చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన స‌చిన్ కేడ్క‌ర్ క్లారిటీ ఇచ్చారు.

రాధే శ్యామ్ చిత్రంలో డాక్ట‌ర్ పాత్ర పోషిస్తున్న‌ట్టు చెప్పుకొచ్చిన స‌చిన్ కేడ్క‌ర్.. ఈ సినిమా జ్యోతిష్యానికి,సైన్స్‌కు మ‌ధ్య సాగే క‌థ నేప‌థ్యంలో ఉంటుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌భాస్ ఈ సినిమాలో చాలా కొత్త‌గా క‌నిపిస్తారు. భ‌విష్య‌త్‌పై స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌లు ఉండే వ్య‌క్తిగా ప్ర‌భాస్ ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నారు అని స‌చిన్ కేడ్క‌ర్ పేర్కొన్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న రాధే శ్యామ్ చిత్రం తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్నడ భాష‌ల‌లో విడుద‌ల కానుంది.