ఈ రోజుల్లో స్టార్ హీరోతో సినిమా అంటే అంత వీజీ కాదు.! స్టార్ దర్శకుడి పరిస్థితి అయినా అంతే.! పెద్ద సినిమా తీయాలంటే పెద్ద నిర్మాతలకు తలకి మించిన భారం అవుతోంది.!
ఏళ్ళ తరబడి సినిమాల నిర్మాణం చేయాల్సి వస్తే, ఆ పెయిన్ ఏంటో పెద్ద హీరోలకీ, పెద్ద దర్శకులకీ, పెద్ద నిర్మాతలకీ బాగా తెలుసు. కానీ, ఏం చేస్తారు.. సినిమాల రేంజ్ పెరిగిపోతోంది.. పాన్ ఇండియా దాటి, పాన్ వరల్డ్.. అనే స్థాయికి అంచనాలు పెరిగిపోయాయ్.! దాంతో, లాభాలే కాదు.. నష్టాలూ ఎక్కువే అవుతున్నాయ్.
‘పుష్ప ది రైజ్’ అనూహ్యమైన రీతిలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా మారాడు ఆ సినిమా పుణ్యమా అని. సినిమా మొదలయ్యాకే, దాన్ని రెండు పార్టులు చేయాలనుకున్నారు. ఇప్పుడది మూడో పార్ట్ వరకూ వెళ్లేలా వుంది.
ఇంతకీ, ‘పుష్ప-2’ విడుదల ఎప్పుడు.? ఈ విషయమై చాలా గందరగోళం నడుస్తోంది. ‘పుష్ప 2 ది రూల్’ అని పేరు పెట్టారు. మూడో దానికి కూడా ఏదో పేరు పెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చేశారు కొందరు ఔత్సాహికులు.
దర్శకుడు సుకుమార్, ‘పుష్ప’ దగ్గరే చాలాకాలంగా లాక్ అయిపోయాడు. క్రియేటివ్ మైండ్ కదా, మెదడులో చాలా కథలు పుట్టుకొస్తుంటాయ్.. వాటికి అన్యాయం జరిగిపోతోంది ‘పుష్ప’ దగ్గరే ఆగిపోవడంతో. తన అసిస్టెంట్స్ ద్వారా కొత్త సినిమాలు చేయిస్తున్నా.. ఈ పరిస్థితి కష్టంగానే వుంది.
మరోపక్క అల్లు అర్జున్ కూడా అంతే. ‘పుష్ప’ నుంచి బయటకు రావాలి, ఇంకో కథతో ప్రేక్షకుల ముందుకెళ్ళాలి. కానీ, బంధం అంత తేలిగ్గా విడిపోయేలా లేదు. మూడోది తథ్యం. అయితే, మధ్యలో ఇంకోటి వస్తుందా.? రాదా.? అన్నది సుకుమార్‌కిగానీ, అల్లు అర్జున్‌కిగానీ స్పష్టత లేదు.