Pushpa 2: పుష్ప 2 బాక్సాఫీస్ – తెలుగు రాష్ట్రల్లో నష్టాలు తప్పవా?

పాన్ ఇండియా సినిమా ‘పుష్ప 2’ బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను సాధిస్తున్న విషయం తెలిసిందే. హిందీ వెర్షన్‌తో పాటు ఇతర భాషలలోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాలేదనే చర్చ జరుగుతోంది. నైజాం, ఆంధ్రాలో బయ్యర్లకు లాభాల బాట పడాలంటే ఇంకా కొన్ని రోజుల పాటు మంచి కలెక్షన్లు అవసరం ఉంది.

‘పుష్ప 2’ మొదటి వారం తెలుగులో బలమైన ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ, తర్వాత రోజుల నుండి వసూళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఏపీ, తెలంగాణలో బయ్యర్లు భారీ ధరలకు ఈ సినిమా హక్కులు తీసుకున్నారు. అయితే టికెట్ రేట్లు, వీకెండ్ ప్రభావం వల్ల తొలి వారంలో మాత్రమే మంచి రాబడి సాధ్యమైంది. రెండవ వారం మధ్యలో కలెక్షన్లు కాస్త బలహీనంగా మారడంతో బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు.

తెలుగు వెర్షన్‌కు మిగిలి ఉన్న 40 శాతం వసూళ్లు రాబట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా, రెండవ వీకెండ్ నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ రన్‌ను మరింత బలపర్చడం కీలకం. ఆదివారం కలెక్షన్లు మంచి స్థాయిలో ఉంటే, ఆ ప్రభావం తరువాతి రోజులపై కనిపించే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో పాటు, మాస్ సెంటర్స్‌లో మళ్లీ హవా కొనసాగితేనే లాభాలు సాధ్యమవుతాయి. మరోవైపు, హిందీ వెర్షన్‌తో పోలిస్తే తెలుగులో సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు ఎందుకు తగ్గుతున్నాయనే విషయంపై విశ్లేషణలు జరుగుతున్నాయి.