అవసరమా రామూ ఈ తలనొప్పి.?

రామ్ పోతినేని హీరోగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాని అనౌన్స్ చేసేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని డీల్ చేయనున్నారు.. నిర్మాణం పరంగా.

గతంలో ‘ఇస్మార్ట్ శంకర్’ పెద్ద హిట్ అయిన దరిమిలా, ఆ కాంబోని నమ్ముకున్నాడు పూరి. ‘లైగర్’ దెబ్బకి పూరి నేలమీదకు వచ్చేశాడు. నిజానికి, చిరంజీవితో పూరి సినిమా అనౌన్స్‌మెంట్.. అని అంతా అనుకున్నారు.

సరే, ఆ సంగతి పక్కన పెడితే, ‘లైగర్’ తలనొప్పులు ఇప్పుడు రామ్ పోతినేని మీద పడేలా వున్నాయ్. రామ్‌కి ఏంటి సంబంధం.? అంటే, ‘డబుల్ ఇస్మార్ట్’ సంగతేంటో చూస్తాం, మాకు గనుక సెటిల్మెంట్ చెయ్యకపోతే.. అంటున్నారు ‘లైగర్’ బాధితులు.

‘ఏం చేస్కుంటారో చేసుకోండి..’ అని గతంలో ఓవరాక్టింగ్ చేసిన పూరి, ఇప్పుడేమో అనూహ్యంగా ఛార్మితో రాయబారం పంపాడు. దాంతో, వ్యవహారం ప్రస్తుతం కాస్త నెమ్మదించినట్లు కనిపించినా, రామ్ పోతినేనికి ఎందుకొచ్చిన తలనొప్పి.? అని మాత్రం సినీ జనాలు చర్చించుకుంటున్నారు. అంటే, ఈ ప్రాజెక్టుని వదిలేసుకోమని సలహా ఇస్తున్నట్టేగా.?