తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల నేపథ్యంలో సినీ పరిశ్రమలో చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు. “పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యారు. ఆయనకు మమ్మల్ని తిట్టే హక్కు ఉంది. ఆయన మన పెద్దన్నలాంటివారు” అని అన్నారు. పవన్ ఆవేదనకు కారణం జూన్ 1 థియేటర్ల బంద్ అంశాన్ని మీడియా తప్పుగా వెలుగులోకి తేవడమేనని స్పష్టం చేశారు. వాస్తవానికి టార్గెట్ పవన్ సినిమా కాదని, కాని పరిస్థితులు అలా కనిపించాయని అభిప్రాయపడ్డారు.
ఏపీ సీఎం అపాయింట్‌మెంట్ విషయంలో కూడా దిల్ రాజు స్పష్టత ఇచ్చారు. “ఎఫ్‌డీసీ తరఫున అపాయింట్‌మెంట్ కోరాము, ఇంకా రాలేదు. ప్రతి నిర్మాతకు తనకు సంబంధించి సమస్య ఉంటే పరిగెడతారు. కానీ పరిశ్రమ తరఫున వెళ్లాల్సింది ఛాంబర్. పెద్దలు ఎవరి దారిలో వారు వెళ్తున్నారు” అని పేర్కొన్నారు. ప్రొడ్యూసర్ గిల్డ్ ఏర్పాటుపై మాట్లాడుతూ, “నిర్మాతలకు తక్షణ సమస్యలు ఉండే సమయంలో ప్రత్యేకంగా చర్చించేందుకు గిల్డ్ అవసరమే. సినిమా విభాగాల్లో ఏకాభిప్రాయం ఉంటుందని ఊహించడం సరి కాదు” అన్నారు.
థియేటర్ల బంద్ వెనుక తానే ఉన్నారన్న ప్రచారాన్ని దిల్ రాజు ఖండించారు. తూర్పు గోదావరిలో జరిగిన ఎగ్జిబిటర్ల మీటింగ్‌కు తాను హాజరుకాలేదని స్పష్టం చేశారు. “ఆ సమావేశానికి సంబంధించిన వివరాలన్నీ నా వద్ద ఉన్నాయి. కీలకంగా వ్యవహరించినది సత్యనారాయణ గారు. ఆయన డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, జనసేన పార్టీ సభ్యుడు కూడా” అని వెల్లడించారు. ప్రస్తుతానికి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కూర్చుని మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. రాబోయే రోజుల్లో పరిశ్రమలో సమన్వయం అవసరమని వ్యాఖ్యానించారు.