ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.298.5 కోట్లు వసూలుచేసింది. రూ.500 కోట్లు నేడో, రేపో దాటడం ఖాయమైపోగా, రూ.1000 కోట్ల వైపు వడివడిగా అడుగులు వేస్తుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘కల్కి’ విజయపథంలో నడుస్తున్న సందర్భంగా చిత్ర నిర్మాత అశ్వనీదత్ విూడియాతో మాట్లాడారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపిక పదుకొణె వంటి అగ్రతారలపై ఉన్న నమ్మకంతోనే ’కల్కి’ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికి కారణమని తెలిపారు. ముఖ్యంగా నాగ్ అశ్విన్ విజువలైజేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలన్నారు.
‘మహానటి’ చేసిన తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడన్న నమ్మకం కలిగింది. అదే మా అమ్మాయిలకు చెప్పా. అతడు ఏ స్జబెక్ట్ చెప్పినా వద్దని చెప్పకుండా ముందుకువెళ్లమని చెప్పా. ‘కల్కి’ చూసిన సినీ పెద్దలంతా నాగ్ అశ్విన్ టేకింగ్‌ను మెచ్చుకుంటున్నారు. అమితాబ్ పాత్ర విషయంలోనూ నాగీ అనుకున్నది అనుకున్నట్లుగా తీశాడు. ప్రచార కార్యక్రమాల్లో ఆయన నా కాళ్లకు నమస్కారం పెట్టడంతో ఒక్కసారిగా షాకయ్యా. ఇక కృష్ణుడి పాత్రకు ముందుగా ఎవరినీ అనుకోలేదు. అందుకే సినిమాలోనూ ఆ పాత్ర ముఖాన్ని రివీల్ చేయలేదు.
ఈ మూవీ మొదలుపెట్టే ముందు లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో మాట్లాడాం. ఆయన కొన్ని చక్కటి సూచనలు చేశారు. అవి సినిమాకు హెల్ప్ అయ్యాయి. ఇక బుజ్జి కాన్సెప్ట్ అంతా నాగ్ అశ్విన్‌దే. సుప్రీం యాస్కిన్ పాత్ర కోసం తొలుత కమల్‌హాసన్‌ను అనుకోలేదు. అర్జునుడిగా విజయ్ దేవరకొండ సహా మిగిలిన వాళ్లందరినీ మొదటినుంచే అనుకున్నాం. సినిమా కథా చర్చల్లో ఉండగానే రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే కమల్‌హాసన్ ఇందులో భాగం అయ్యారో అప్పుడే రెండు భాగాలు చేయాలని కచ్చితంగా నిర్ణయం తీసుకున్నాం.
కల్కి పార్ట్-2కు సంబంధించి కొంతమేర చిత్రీకరణ పూర్తయింది. కొన్ని కీలక సన్నివేశాలు, వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అందుకు ఏడాదిపైనే పట్టొచ్చు. రెండో భాగం విడుదలపై ప్రస్తుతానికి ఎలాంటి తేదీ అనుకోలేదు. వచ్చే ఏడాది ఇదే సమయానికి రావచ్చు.’కల్కి2’ వరకే కథ అనుకున్నాం. పార్ట్-3గురించి ఇంకా ఏవిూ అనుకోలేదన్నారు. మా టీమ్ అంతా విజయాన్ని ఆస్వాదిస్తోంది. సినిమా షూటింగ్ సమయంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందీ పడలేదు. సినిమా కోసం రూ.600 కోట్లు పెట్టే ధైర్యం ఇచ్చింది ప్రభాస్, కమల్, అమితాబ్ బచ్చన్‌లే. సెకండాఫ్‌లో కమల్‌హాసన్ పాత్ర కచ్చితంగా బీభత్సం సృష్టిస్తుంది. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో నాతో కలిసి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్‌లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అశ్వినీదత్ అన్నారు.