Prabhas: 2024లో టాప్ ప్లేస్ లో ప్రభాస్ సినిమా

ప్రభాస్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ, ఐఎండీబీ 2024 సర్వేలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) ప్రతి సంవత్సరం మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాను విడుదల చేస్తుంది. ఈ జాబితాలో ప్రేక్షకుల క్రేజ్, చర్చల ఆధారంగా టాప్ పొజిషన్‌లో నిలిచిన సినిమాలను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా 2024లో అత్యంత పాపులర్ సినిమాల జాబితాను విడుదల చేసిన ఐఎండీబీ, ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాను మొదటి స్థానంలో ఉంచింది.

ఈ ఏడాది ఐఎండీబీ జాబితాలో రెండో స్థానంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్త్రీ సీక్వెల్ నిలవడం విశేషం. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి వంటి స్టార్ కాస్ట్‌తో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఆ తరువాత స్థానాల్లో తమిళ సినిమా మహారాజా, అజయ్ దేవగణ్ నటించిన షైతాన్ చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో తమిళ, మలయాళం, హిందీ సినిమాలకు ప్రాధాన్యత కల్పించడం విశేషంగా నిలిచింది.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఫైటర్ ఐఎండీబీ జాబితాలో ముఖ్య స్థానాన్ని దక్కించుకోగా, మలయాళం బ్లాక్ బస్టర్ మంజుమ్మెల్ బాయ్స్ కూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది. మరోవైపు, కార్తీక్ ఆర్యన్ నటించిన హారర్ కామెడీ సీక్వెల్ భూల్ భూలయ్య 3 మంచి స్పందన పొందగా, చిన్న బడ్జెట్‌లో విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన బాలీవుడ్ సినిమా కిల్ కూడా టాప్ టెన్‌లో నిలిచింది.

ఈ జాబితాలో సింగం ఎగైన్, లాపతా లేడీస్ వంటి సినిమాలు కూడా చోటు దక్కించుకోవడం ఇండస్ట్రీలో కొత్త చర్చలకు దారితీసింది. అన్ని భాషల నుంచి మంచి కంటెంట్‌ను ప్రేక్షకులు ప్రోత్సహించడం, విభిన్నమైన కథలకు చోటు కల్పించడం జాబితా విశిష్టతను పెంచింది. ప్రభాస్ కల్కి 2898 ఏడీ అగ్రస్థానంలో నిలవడం టాలీవుడ్‌ స్థాయిని మరింత పెంచినట్లు చెప్పవచ్చు.