KGF 2: మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసిన పాపులర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్…!

KGF 2: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కేజీఎఫ్ 2. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ సినిమాలో హీరోగా యశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. 2018 లో కేజీఎఫ్ చిత్రంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి భారీ స్పందన వచ్చింది. పలు భాషల్లో విడుదలై కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఒక్క సినిమాతో యశ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచరిస్తూ ఈ మూవీ టీమ్ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు. అంతే కాకుండా ప్రభాస్ తో తీయబోతున్న సలార్, అదే విధంగా ఎన్టీఆర్ తో కలిసి పని చేస్తున్న ప్రాజెక్ట్ గురించి వెల్లడించారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిపై ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. 90’s లో మెగాస్టార్ చిరంజీవికి తనకు ఫేవరేట్ హీరో అని, హీరోయిజానికి తగ్గట్టుగా ఆయన సినిమాలు సరిగ్గా సూట్ అయ్యేవంటూ ప్రశాంత్ నీల్ చెప్పారు. అంతే కాదు అప్పట్లోనే తెలుగు సినిమాలు చాలా చూసే వాడినంటూ ఆయన చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక రోజు రోజుకీ కేజీఎఫ్ 2 సినిమాకు క్రేజ్ పెరిగి పోవడంతో ఫ్యాన్స్ విడుదల తేదీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక హీరో దళపతి విజయ్ చేసిన బీస్ట్ సినిమా కూడా ఒక్క రోజు తేడాతో విడుదల కానుండడంతో ఈ సినిమాకు భారీ పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది.