హారర్-కామెడీ జానర్‌లో కాంచన సిరీస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ దక్షిణాది సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు మూడు భాగాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన లారెన్స్, ఇప్పుడు ‘కాంచన 4’ పై దృష్టి సారించాడు. అయితే ఈ సారి కథలో ఓ షాకింగ్ ట్విస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర విషయంలో లారెన్స్ ఊహించని ప్రయోగం చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇప్పటి వరకు పూజా హెగ్డే గ్లామర్ రోల్స్‌తోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. కానీ ‘కాంచన 4’ లో మాత్రం ఆమె పాత్ర పూర్తిగా భిన్నంగా ఉండబోతోందట. టాక్ ప్రకారం, ఈ సినిమాలో ఆమె చెవిటి-మూగ అమ్మాయి పాత్రలో కనిపించనుందట. సాధారణంగా ప్రేక్షకులు ఆమెను గ్లామరస్ పాత్రల్లోనే ఎక్కువగా చూసినందున, ఇలాంటి ఛాలెంజింగ్ రోల్‌లో ఎలా నటిస్తుందో అనే ఆసక్తి నెలకొంది. గత కొన్ని సినిమాల్లో పెద్దగా హిట్స్ లేకపోవడం, కమర్షియల్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గడం వల్ల, పూజా హెగ్డే ఇప్పుడు కెరీర్‌కి కొత్త మలుపు తీసుకురావాలని చూస్తోందని తెలుస్తోంది.
ఇంతకుముందు లారెన్స్ ‘కాంచన 3’ లో నిత్యా మీనన్‌కు డీ-గ్లామర్ పాత్ర ఇచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. ఆమె పెర్ఫార్మెన్స్ బాగా క్లిక్ కావడంతో, ఆ క్యారెక్టర్ హైలైట్‌గా మారింది. ఇప్పుడు అదే తరహాలో పూజా హెగ్డే పాత్ర కూడా ఎమోషనల్ లెవల్‌లో స్ట్రాంగ్‌గా ఉంటుందని, లారెన్స్ కథలో ఈ పాత్ర కీలకంగా మారుతుందని సమాచారం. కానీ ప్రేక్షకులు ఆమెను ఈ కొత్త అవతారంలో ఎలా అంగీకరిస్తారనేది పెద్ద ప్రశ్న.
ఇటీవల పూజా హెగ్డే కొంత గ్యాప్ తీసుకుని, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే, కాంచన సిరీస్‌లో నటించడం ఆమె కెరీర్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుందనేది చూడాలి. లారెన్స్ ఈ ప్రయోగాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో, ఇది నిజంగా పూజా కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అవుతుందా అన్నది ఆసక్తిగా మారింది.