మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పటికే ఓటీటీ, పైరసీల దెబ్బకు కుదేలైపోతున్న తెలుగు సినిమా రంగానికి రాజకీయ చెదలు పడుతున్నాయి. సినిమాను వ్యాపారాత్మకంగానో, కళాత్మకంగానో చూడడానికి బదులు రాజకీయ దృక్కోణంలో చూసే దుస్థితికి ప్రేక్షకులను నెట్టేసిన ఘనత మన తెలుగు సినిమా రంగానికి చెందుతుంది! సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ సమ్మేళనం అంటారు. కేవలం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడమే కాదు.. లైట్ బాయ్ దగ్గర్నుంచి డైరెక్టర్ వరకు కొన్ని నెలలు ఒక్కోసారి కొన్ని ఏళ్ళు కష్టపడితే గాని ఒక సినిమా రూపొందదు. అంత కష్టపడి తీర్చిదిద్దిన సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అన్న ఆందోళన ఆందోళన ఉండడం సహజం.
అయితే ఎలాగైనా ప్రేక్షకులను తమ సినిమా వైపు ఆకర్షించాలనే దురాలోచనతో కొందరు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగానో, సినిమా రిలీజ్ కి ముందో ఏవో కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేసి ఆ సినిమాకు బజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఫలానా రాజకీయ పార్టీ అని ప్రత్యేకంగా చెప్పకపోయినా ఒక పార్టీని ఉద్దేశించి పరోక్షంగా చేసే రాజకీయ వ్యాఖ్యలు… ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను, అభిమానులను తమ వైపు తిప్పుకోవడానికి పనిచేస్తాయని భావిస్తూ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల ఆ సినిమాకు మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతోంది. ఇటువంటి రాజకీయ వ్యాఖ్యల వల్ల సమాజంలోని ఒక వర్గం ఆ సినిమాలను చూడడం లేదు. ఇటీవల లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు గానీ, ఈనాడు అధినేత రామోజీరావు సంతాప సభలో సంగీత దర్శకుడు కీరవాణి చేసిన వ్యాఖ్యలు గాని. మరి కొన్ని సినిమాల విడుదల సందర్భంగా కొందరు నటులు చేసిన వ్యాఖ్యలు గానీ సినిమా రంగానికి ఏ మాత్రం మేలు చేసేవి కావు.
పెద్ద హీరోలు నటించే ఫ్యాన్ ఇండియా సినిమాల సంగతి పక్కన పెడితే 50 నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్లో రూపొందించే సినిమాలే ఎక్కువ. కేవలం 200 కోట్ల రూపాయల వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడానికి రాజకీయంగా బురద చల్లాల నే ఆలోచన సినిమా రంగం వారికి వస్తే వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఒక్కో ఎన్నికను ఎదుర్కొనే రాజకీయ పార్టీలు సినిమా రంగవారి చేసే వ్యాఖ్యలు లైట్ గా ఎలా తీసుకుంటాయి. వారు కూడా సినిమాలను వాటి వెనుక ఉన్న వ్యక్తులను రాజకీయంగా చూడ్డం మొదలుపెడతారు.