ఆలస్యమైనా కొందరి కోసం కొన్ని పాత్రలు రాసి పెట్టి ఉంటాయి. అందులో ఎవరు నటించాలని ప్రయత్నించినా చివరకు చేరాల్సిన వారికే చేరతాయి. అలాంటి పాత్రే ‘అలీభాయ్’. మహేశ్‌బాబు కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పోకిరి’. ఈ సినిమాలో మహేశ్‌బాబు పాత్రకు ఎంత క్రేజ్ వచ్చిందో అలీభాయ్ పాత్రకు కూడా అంతే క్రేజ్ వచ్చింది. కనిపించేది కొద్దిసేపే అయినా ఆ పాత్ర ఉన్నంతసేపు స్క్రీన్ దడదడలాడిపోతుంది.
తొలుత ఈ పాత్ర కోసం వేరే నటులను అనుకున్నారట దర్శకుడు పూరి జగన్నాథ్. నటీనటుల ఎంపిక జరుగుతున్న సమయంలో ప్రకాశ్‌రాజ్‌ను పిలిచి ఆషిశ్ విద్యార్థి చేసిన ఎస్సై పశుపతి పాత్ర ఇస్తానని చెప్పారట పూరి. అయితే, తనకు ఆ పాత్ర సెట్ కాదని సున్నితంగా తిరస్కరించారట. ఆ వెంటనే షాయాజీ షిండే చేసిన డీసీపీ సయ్యద్ పాత్ర ఆఫర్ చేసినా వద్దని చెప్పారట.
మాటల సందర్భంలో ‘వేరే ఊరి నుంచి వస్తాడు కదా! వాడెవడు’ అని ప్రకాశ్‌రాజ్ అడిగితే ’అలీభాయ్.. అది కేవలం ఏడు రోజుల వేషం అంతే. అది నీకెందుకు’ అని పూరి ప్రశ్నించారు. దీంతో ‘హీరో కైమాక్స్‌లో ఎవరితో ్గఫైట్ చేస్తాడు చెప్పు’ అని ప్రకాశ్‌రాజ్ తిరిగి ప్రశ్నించడంతో ఆలోచనలో పడ్డ పూరి, చివరకు అలీభాయ్ పాత్రకు తీసుకున్నారు.
ముమైత్‌ఖాన్ పాట జరుగుతున్న సమయంలో ప్రకాశ్‌రాజ్ సెట్‌లోకి అడుగుపెట్టారు. ఐదు రోజులు షూటింగ్ అయిన తర్వాత సడెన్‌గా పూరి జగన్నాథ్‌కు మరో ఆలోచన వచ్చింది. వెంటనే ప్రకాశ్‌రాజ్ పాత్ర కోసం కొత్త సన్నివేశాలను అప్పటికప్పుడు రాసుకొని, దాని నిడివి పెంచారు. ‘గిల్లితే గిల్లించుకోవాలి’ అంటూ ప్రకాశ్‌రాజ్ చెప్పే డైలాగ్‌లు, క్లెయిమాక్స్‌లో మహేశ్ కొడితే అలీభాయ్ చెవులు కొద్దిసేపు పనిచేయకపోవడం వంటి సన్నివేశాలు బాగా పేలాయి.