ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్ల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టికెట్ ధరల నియంత్రణతో పాటు, మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో తినుబండారాల ధరలు, వాటి నాణ్యతపై ప్రభుత్వ శాఖలు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. “నా సినిమాలకైనా ఇదే రూల్ వర్తించాలి” అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టంగా హితవు పలికారు.
ప్రేక్షకులకు భారం కాకుండా, సాధారణ కుటుంబాలు కూడా హాల్లో సినిమా చూడగలగాలంటే పాప్‌కార్న్, వాటర్, డ్రింక్స్ ధరలపైనా కట్టడి అవసరమని పవన్ పేర్కొన్నారు. టికెట్ ధరలు పెంచాలంటే నిర్మాతలు వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే అర్జీలు ఇవ్వాలన్నారు. పరిశ్రమకు నమ్మకం రావాలంటే, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఇటీవల జరిగిన థియేటర్ బంద్ ప్రకటనలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నిర్మాత, రాజకీయ నాయకుడు కలిసి ఇండస్ట్రీని భయపెట్టేలా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఎవరు అయినా రూల్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవని, వారిలో జనసేనవారు ఉన్నా ఉపేక్షించబోమన్నారు.
చివరగా, రాబోయే ఫిలిం డెవలప్‌మెంట్ పాలసీలో ఇండస్ట్రీ అభివృద్ధికి అవసరమైన సూచనలను ఛాంబర్, నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, నటుల సంఘం వంటి ప్రతినిధుల నుంచి తీసుకుంటామని తెలిపారు. “బెదిరింపులతో కాదు, చట్టబద్ధంగా నడిచే సినిమా పరిశ్రమే ప్రభుత్వ లక్ష్యం” అంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.