‘పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా..’, ‘వయ్యారి భామ నీ హంస నడకా.. ఎందుకే ఈ తొందర తొందర’, బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా’ ఏంటి ఈ పాటలు అనుకుంటున్నారా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల కాంబినేషన్‌లో వచ్చిన తమ్ముడు, బద్రి, జానీ వంటి చిత్రాలు ఎంతటి మ్యూజికల్ హిట్‌గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో వీరిద్దరి కలయికలో సినిమా అంటే ఫ్యాన్స్ పండగ చేసుకునేవారు.
గతంలో పవన్ సినిమాకు సంగీతం అందిస్తూనే దాదాపు అన్ని పాటలను రమణ గోగులనే పాడేవారు. ఎందుకంటే పవన్ గొంతు రమణ గోగుల గొంతు అలా మ్యాచ్ అయ్యేది. ఎంతలా అంటే సినిమాల పట్ల అవగాహన లేనివారు ఆ పాటలను పవనే స్వయంగా పడుతున్నారా అనే అనుమానం వచ్చేది. అంతలా వారిద్దరి గొంతు మ్యాచ్ అయ్యేది. ఇక సంగీత అభిమానులు కూడా ఆయన వీరిద్దరి సంగీతాన్నే ఎక్కువ కోరుకునేవారు. సినిమాల పరంగానే కాకుండా పవన్‌కు రమణ గోగుల మంచి స్నేహితుడు.
ఖరగ్ పూర్ ఐఐటీ నుంచి ఎంటెక్, లూసియానా స్టేట్ యూనివర్శిటీ నుంచి ఎంఎస్ (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేసిన రమణ గోగుల ప్రస్తుతం తన సంస్థల కార్యకలాపాలు చూసుకుంటున్నప్పటికీ పవన్‌తో టచ్‌లోనే ఉంటున్నారట. కేవలం పవన్‌కే కాకుండా రేణు దేశాయ్‌కు కూడా రమణ మంచి సన్నిహితుడు, ఇక ఈ విషయాలను పక్కకుపెడితే. పవన్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత దూకుడు పెంచిన పవన్ వరుస చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తన తదుపరి చిత్రాల్లో ఒక్క సినిమా కోసం పవన్-రమణ కలవనున్నారట. ఇక ఈ కలయిక రిపీట్ అవుతుందనే వార్త నెట్టింట్లో తెగ వైరల్ కావడంతో అటు పవన్ అభిమానులు ఇటు సంగీత అభిమానులు తెగ సంబరపడుతున్నారు.