Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఫోర్.. ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది!

పవన్ కళ్యాణ్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కానీ ఇటీవల వరుసగా మూడు రీమేక్‌లతో వచ్చిన చిత్రాలు అభిమానులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయాయి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు కలెక్షన్లు సాధించినా, పవన్ రేంజ్‌కు తగ్గ సాటిగా అనిపించలేదు. ముఖ్యంగా బ్రో చిత్రం యావరేజ్ టాక్‌తో ప్రేక్షకుల నిరాశను ఎదుర్కొంది. అయితే ఇవన్నీ గతం. ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నది పవన్ అసలైన స్ట్రెయిట్ సినిమాల కోసం.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న నాలుగు సినిమాలూ స్ట్రెయిట్ సబ్జెక్టులతోనే ఉండటం విశేషం. హరిహర వీరమల్లు పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో జూన్ 12న విడుదల కానున్న ఈ చిత్రం పవన్ కెరీర్‌లో మొదటి పీరియాడికల్ డ్రామా. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్‌కి విజువల్ ట్రీట్ అందించనుందని ఊహలు. అదే విధంగా, ఒరిజినల్ కథతో రూపొందుతున్న ‘ఓజి’ సినిమా పైన హైప్, బిజినెస్ అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా పూర్తిగా కొత్త స్క్రిప్ట్‌తో రూపుదిద్దుకుంటోందట. హరీష్ శంకర్ దానికి ప్రత్యేకమైన ట్రీట్‌మెంట్ అందిస్తున్నారని సమాచారం. మొదట ఇది తేరీ రీమేక్ అన్న టాక్ వచ్చినా, ఇప్పుడు ఫుల్ స్ట్రెయిట్ ప్రాజెక్ట్ అవుతుందని స్పష్టమైంది. ఆ తర్వాత ‘హరిహర వీరమల్లు పార్ట్ 2’ కూడా షూటింగ్‌కు వెళ్లనుంది. ఇందులో మొదటి పార్ట్ క్లైమాక్స్‌లోనే రెండో పార్ట్‌కు సంబంధించిన హింట్ ఉంటుందని తెలుస్తోంది.

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ నాలుగు సినిమాల థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.500 కోట్లను దాటే అవకాశముంది. ఇతర హక్కులతో కలిపితే ఈ మొత్తాన్ని రెట్టింపు చేసే ఛాన్సుంది. రాజకీయంగా బిజీగా ఉన్న పవన్ ఇకపై సినిమాలు తగ్గించవచ్చన్న ప్రచారం మధ్య, ఈ నాలుగు ప్రాజెక్టులు అభిమానుల హృదయంలో చిరస్థాయిగా నిలిచేలా ఉంటాయన్న నమ్మకంతో చూస్తున్నారు.