కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతూనే ఉంది. ప్రముఖులని కూడా వణికిస్తున్న వైరస్ మెగా కాంపౌండ్‌లో కూడా అడుగుపెట్టింది. కొద్ది రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబు కరోనా బారిన పడగా, ఆసుపత్రిలో మంచి వైద్యం పొందిన ఆయన త్వరగానే కోలుకున్నారు. చలి జ్వరంతో పాటు మత్తుగా అనిపించడంతో నాగబాబు పరీక్ష చేయించుకున్నారు. పరీక్షలో పాజిటివ్ అని తేలింది. అయితే తనకు న్యుమోనియా ఉండడంతో ఆసుపత్రిలో చేరారు. రెమిడెసివర్ ఔషదాన్ని ఐదు రోజుల పాటు వాడిన తర్వాత నాగబాబు కోలుకున్నారు. కరోనా నుండి కోలుకున్నాక ప్లాస్మా దానం కూడా చేశారు.
కరోనాకు ఎవరు అతీతులు కాదనే విషయం తాను కోలుకున్న తర్వాత నాగబాబు తెలియజేశాడు. దీనికి మందు లేదని, 14 రోజుల తర్వాత అదే తగ్గుతుందని హితవు పలికారు. అయితే ఎవరు ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవిని కూడా కరోనా సెగ తగిలింది. ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనే ముందు ఆయన కరోనా పరీక్షలు జరుపుకోగా, పాజిటివ్ అని తేలింది. అయితే ప్రస్తుతానికి తనకు ఎలాంటి లక్షణాలు లేవని చెప్పిన చిరు హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు స్పష్టం చేశారు. అంతేకాదు గత నాలుగైదు రోజులలో తనని ఎవరు కలిసారో వారు పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.
మెగా బ్రదర్స్‌లో చిరంజీవి, నాగబాబు కరోనా బారిన పడగా, పవన్ కళ్యాణ్ ఒక్కడే మిగిలాడు. ఇన్నాళ్ళు చాతుర్మాస దీక్షతో ఫాం హౌజ్‌కు పరిమితమైన పవన్ రీసెంట్‌గా వకీల్ సాబ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఆయన షూట్ చేస్తున్నప్పటికీ అభిమానులలో ఆందోళన నెలకొంది. ఇద్దరు మెగా హీరోలపై పగ బట్టిన కరోనా పవన్‌పై కూడా తన ప్రతాపం చూపిస్తుందేమోనని భయపడుతున్నారు. ఆయనకు సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ తర్వాత పవన్..క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం, హరీష్ శంకర్‌తో ఓ చిత్రం , సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఓ చిత్రం చేయనున్నాడు.