ఓజీ.. ఓజీ.. ప్రస్తుతం ఎక్కడా చూసినా ఇదే నినాదం వినపడుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ మూవీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, లిరికల్ వీడియోలు సినిమాపై ఫుల్ క్రేజ్ పెంచేశాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా పవన్.. ఈ సినిమాలో స్లైలిష్ లుక్‌లో కనిపించారు. సినిమా విడుదలకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో మూవీ టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. విదేశాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలోనే టికెట్స్ బుకింగ్ ఓపెన్ కానున్నాయి. మరోవైపు ఏపీలో అర్థరాత్రి నుంచి బెనిఫిట్ షోలు వేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించింది. విడుదల తేదీ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలుపుకొని టికెట్ రేటు మీద రూ.125.. మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ.150 పెంపునకు అంగీకారం తెలిపింది.
అలాగే అర్థరాత్రి ఒంటి గంట నుంచి బెనిఫిట్ షో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. బెనిఫిట్ షో టికెట్ ధర ఏకంగా రూ.1000లకు(జీఎస్టీతో కలిపి) విక్రయించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం రూ.1000 టికెట్ రేట్‌కు అనుమతి ఇవ్వడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం సినిమా కాబట్టి రేట్లు పెంచుతారా అని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ టికెట్ ధరలను సైతం రూ.800 ప్లస్ జీఎస్టీ పెంచిన విషయం గుర్తులేదా అని పవన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఓజీ సినిమాపై మాత్రం భారీ అంచనాలు నెలకున్నాయి.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్ల పెంపు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ షో ప్రదర్శించిన సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ప్రభుత్వం ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం నిరాకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో ఓజీ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.
