ఆస్కార్‌కు అధికారికంగా 2018 సినిమా ఎంపిక చేస్తూ ప్రకటన

ఆస్కార్‌ 2024 అవార్డుల కోసం ఇండియా నుంచి మలయాళం చిత్రం 2018 అధికారికంగా ఎంపికైయింది. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్‌ అవార్డుల కోసం బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ’2018’ చిత్రాన్ని ఎంపిక చేశారు.

ప్రముఖ దర్శకుడు గిరీష్‌ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్‌ కమిటీ, ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న మొత్తం 22 చిత్రాలను కమిటీ వీక్షించిన అనంతరం.. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరి కోసం ’2018’ సినిమాను ఎంపిక చేసింది.

2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో టోవినో థామస్‌ ప్రధాన పాత్ర పోషించారు. జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల గొప్ప భావోద్వేగాన్ని కలిగించింది. వరదల్లో మనమే చిక్కుకుపోయామా అనుకునేంత గొప్పగా దర్శకుడు ఈ చిత్రంలోని సన్నివేశాల్ని మలిచాడు.’ఎవ్రీవన్‌ ఈజ్‌ ఎ హీరో’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. ఆ ట్యాగ్‌ లైన్‌ కి తగ్గట్టు ఇందులోని ప్రతి పాత్ర ప్రేక్షకుడి మనసులో ముద్రవేసుకుంది.

అటు కమర్షియల్‌ గానూ ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అత్యున్నత సాంకేతిక నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్‌ కి పోటీ పడుతుంది.