ఓదెల సినిమా కోసం బోనం ఎత్తిన తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్‌ దర్శకుడు సంపత్‌ నంది కథను అందిస్తుండగా.. అశోక్‌ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా లెవల్లో రిలీజ్‌ అవ్వడానికి సిద్దం అవుతుంది. అయితే హైదరాబాద్‌ ఆషాడ బోనాల పండుగ సందర్భంగా చిత్రబృందం పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో తమన్నా బోనం ఎత్తుకుని వస్తున్నట్లు పోస్టర్‌ ఉంది.

కాగా ఈ పోస్టర్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో తమన్నా శివశక్తి అనే పాత్రలో నటిస్తుండగా.. మహదేవ్‌కు పరమభక్తురాలిగా కనిపించనుంది. ఓదెల సద్గుణ రక్షకురాలిగా ఇందులో కనిపించనుంది. ‘ఓదెల 2’ చిత్రంలో వశిష్ఠ ఎన్‌ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌, మధు క్రియేషన్స్‌పై తెరకెక్కిస్తున్నారు. ‘కాంతార’ చిత్రానికి గూస్‌బంప్స్‌ తెప్పించే మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సమకూర్చిన అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ‘ఓదెల 2’ షూటింగ్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో మొదలుపెట్టారని తెలిసిందే. ఈ ఫొటోలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో హల్‌ చల్‌ చేస్తున్నాయి.