జపాన్‌లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్త ఏడాదికి ప్రజలందరూ స్వాగతం పలుకుతున్న వేళ జపాన్ ప్రజల గుండెల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. జపాన్‌లో షూటింగ్ ముగించుకొని సోమవారం రాత్రి తారక్ హైదరాబాద్ చేరుకున్నారు.
వారం రోజులపాటు అక్కడ ‘దేవర’ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సినిమా చిత్రీకరించిన ప్రాంతంలో భూకంపం రావడం తన హృదయాన్ని కలచివేసిందని.. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలని తారక్ ట్వీట్ చేశారు. ”జపాన్ నుంచి ఇవాళే ఇంటికి వచ్చాను. అక్కడ భూకంపం గురించి తెలిసి షాక్ అయ్యాను.
గత వారం అంతా అక్కడే ఉన్నాను. భూకంపం బారిన పడిన ప్రజల గురించి తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది. వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. జపాన్ ప్రజలందరూ ధైర్యంగా ఉండండి”అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సోమవారం జపాన్ లో దాదాపు 21 సార్లు భూమి కంపించడంతో పశ్చిమ ప్రాంతం అస్తవ్యస్తం అయింది.
ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయపడినుట్ల అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తారక్ ‘దేవర’ చిత్రంతో బిజీగా ఉన్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. కొరటాల శివ దర్శకుడు. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.