పాతతరం అగ్ర కథానాయకుల్లో ఎన్టీరామారావు గారు తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకొని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని సగర్వంగా నిలిపిన గొప్ప వ్యక్తి. ఇప్పటికీ రాముడు కృష్ణుడి విగ్రహాలను చూస్తే ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నటన మీద మక్కువతో సినిమాల్లో ఎటువంటి క్యారెక్టర్ అయినా మనసుపెట్టి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా చేసేవారు. అయితే రామారావు గారు కూడా కొన్ని విజయవంతమైన సినిమాలను కొన్ని కారణాల చేత వదులుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హీరో శోభన్ బాబుకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చిన సినిమాల్లో మానవుడు దానవుడు సినిమా కూడా ఒకటి. మొదట ఈ సినిమాను ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్టు రాసుకున్నారట దర్శక నిర్మాతలు.
అయితే ఎన్టీఆర్ కి కథ చెప్పిన తర్వాత ఆలోచించి చెబుతాను అన్నారట. దానికి కారణం అప్పటికే కృష్ణుడు, రాముడి వేషాల్లో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచి అలరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి సమయంలో మాస్ క్యారెక్టర్ వేస్తే సగటు ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అన్న భావనతో ఈ సినిమాను వద్దనుకున్నారని సినిమా పెద్దలు చెప్తుంటారు.
దీంతో మానవుడు దానవుడు సినిమా శోభన్ బాబు గారిని వరించి భారీ విజయాన్ని అందుకుంది. యంగ్ హీరోగా అప్పుడే శోభన్‌బాబు పుంజుకుంటున్న నేపథ్యంలో అన్నగారు స్వయంగా ఆయనను పిలిచి అభినందించారనేది సినీ వర్గాల్లో అప్పట్లో చర్చ జరిగేది. అలాగే నాగేశ్వరరావు గారికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన భక్తతుకారం సినిమా కూడా మొదట ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్టు రెడీ చేసుకున్నారు. అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమా నాగేశ్వరరావు గారికి దక్కి మంచి పేరు తీసుకొచ్చింది. ఎన్టీ రామారావు గారు ఇలాంటి కొన్ని విజయవంతమైన సినిమాలను వదులుకోవాల్సి రావడం అభిమానుల్లో కొంత నీరుత్సాహం కలిగించే విషయమే అని చెప్పొచ్చు.