నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. జెమెనీ టీవీలో `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే షో ద్వారా హోస్ట్‌గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు ఎన్టీఆర్. తాజాగా ఈ షో ప్రోమోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా జెమినీ టీవీ వారు ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయగా.. అందులో ఎన్టీఆర్ పాల్గొని ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఈ ప్రెస్ మీట్‌లో పలువురు అడిగిన ప్రశ్నలకు ఎన్టీఆర్ చాలా ఓపిగ్గా సమాధానం చెప్పారు. అయితే ఈ క్రమంలోనే ఓ వ్యక్తి.. `మీ అభిమానులు రావాలి, కావాలి అంటే పోలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది` అని ప్రశ్నించాడు. దీనికి ఎన్టీఆర్.. ఇది సమయం కాదు, సందర్భమూ కాదు అని తెలిపాడు. తర్వాత ఓ రోజు మంచిగా వేడి వేడి కాఫీ తాగుతూ దాని గురించి తీరిగ్గా మాట్లాడుకుందామని ఎన్టీఆర్ బదులిచ్చాడు. దీంతో ఇప్పట్లో తన పోలిటిక్ ఎంట్రీ ఉండదని ఎన్టీఆర్ చెప్పకనే చెప్పేశాడు.
ఈ సంధర్భంగా సోషల్ మీడియా ద్వారా టీమ్ తారక్ ట్రస్ట్ చేస్తున్న సేవలపై విలేఖరి ప్రశ్నించగా.. అటువంటి కార్యక్రమాలు తనకు ఎంతో సంతోషం కలిగిస్తాయి అంటూ చెప్పుకొచ్చారు. ప్రతి ఊరిలో టీమ్ తారక్ ట్రస్ట్ చేస్తోన్న సేవల గురించి మాట్లాడుతూ.. నేను అభిమానులకు చేసేదానికంటే.. అభిమానులు నాకు చెయ్యడం చాలా ఎక్కువే అవుతోందని, నేను ఏరోజూ ఇలా చేస్తుంటే బాగుంటుంది అనలేదు.. ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్లు అనుకుని చెయ్యడం వల్ల వచ్చిన మహోన్నతమైన కార్యక్రమం ఇది.. అంటూ తన అభిమానులను చేస్తోన్న కార్యక్రమాలను ప్రశంసించారు.