జూనియర్ ఎన్టీయార్ ‘దేవర’ ఎంత వెనక్కి.?

ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ‘దేవర’ సినిమా వాయిదా పడక తప్పేలా లేదు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఓ వైపు పరీక్షలు.. ఇంకో వైపు ఎన్నికలు వెరసి.. ఫిబ్రవరి నుంచి మే వరకూ పెద్ద సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చన్నది తాజా ఖబర్. మిగతా సినిమాల సంగతెలా వున్నా, ‘దేవర’ సినిమా అయితే వాయిదా పడటం దాదాపు ఖాయమే.

ఇటీవలే సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డంతో ‘దేవర’ షూటింగ్‌కి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వీఎఫ్ఎక్స్ పనులు కూడా ఆలస్యం అయ్యేలా వున్నాయి. వీటన్నిటికీ తోడు, సంగీత దర్శకుడు అనిరుధ్ వైపు నుంచి చాలా ఆలస్యం జరుగుతోందిట.

ఈ నేపథ్యంలో ‘దేవర’ మొదటి భాగం ఏప్రిల్ 5న వచ్చే అవకాశం దాదాపు లేనట్టే. ఆగస్టు వరకూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

రేపో మాపో వాయిదాపై పూర్తి స్పష్టత ఇవ్వాలనుకుంటోందిట ‘దేవర’ యూనిట్. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవకూడదనీ, రిలీజ్ డేట్ విషయంలోనూ అన్ని సానుకూలతల్నీ పరిగణనలోకి తీసుకోవాలని దర్శకుడు కొరటాల, హీరో ఎన్టీయార్‌తోపాటు నిర్మాతలూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.