మోక్షజ్ఞతో హిస్టారికల్ సీక్వెల్.. గుడ్ న్యూస్ చెప్పిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ అందిస్తూ ముందుకుసాగుతున్నారు. తాజాగా, ఆయన ‘ఆదిత్య 369’ సీక్వెల్ ‘ఆదిత్య 999 మ్యాక్స్’ గురించి ఇచ్చిన అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 1991లో విడుదలైన ఆదిత్య 369 క్లాసిక్ చిత్రం తెలుగు చిత్రసీమలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సీక్వెల్ వార్తలు బాలయ్య ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్ 4లో బాలయ్య ఈ అద్భుతమైన అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. డిసెంబర్ 6న స్ట్రీమ్ కానున్న ఈ ఎపిసోడ్ కోసం బాలయ్య ప్రత్యేకంగా ‘ఆదిత్య 369’ గెటప్‌లో కనిపించారు. స్పేస్ సూట్ ధరించి, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఉండే లుక్‌లో ఆయన స్టేజ్‌పై సందడి చేశారు. ఈ లుక్ అభిమానులను మాత్రమే కాక, సామాన్య ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తోంది.

‘ఆదిత్య 369’ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ, తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలకు దారులు తెరిచిన చిత్రం. సీక్వెల్‌లో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ కథానాయకుడిగా తెరంగేట్రం చేయబోతున్నారు. బాలయ్య ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించడం విశేషం. ఇది మోక్షజ్ఞకు మాత్రమే కాదు, కుటుంబానికి కూడా ఒక గౌరవవంతమైన ప్రాజెక్ట్.

ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, దర్శకుడు ఎవరనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. బాలయ్య స్వయంగా డైరెక్ట్ చేస్తారా లేక మరో దర్శకుడి వైపు మొగ్గుచూపుతారా అనే అంశం త్వరలోనే వెల్లడికానుంది. ప్రస్తుతం మోక్షజ్ఞ ప్రశాంత వర్మ సినిమా కోసం సిద్దమవుతున్న విషయం తెలిసిందే.