సినిమా వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాల్లో కామెంట్లు పాస్ చేసేసినట్లు, సినిమా రంగంలో కామెంట్లు పాస్ చేస్తే కుదరదు. హైట్ విషయమై ఇటీవల తన కుమారుడు వరుణ్ తేజ్ సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రమోనల్ ఈవెంట్‌లో నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఓ పొట్టి హీరో మీద నాగబాబు సెటైరేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ఈ విషయమై వరుణ్ తేజ్ అప్పుడే వివరణ ఇచ్చేశాడు. కానీ, వివాదం చల్లారలేదు. సినిమా వేదికలపై నాగబాబు చేసిన కామెంట్, రాజకీయాల్లోనూ వైరల్ అవుతోంది.
దాంతో, మెగా కాంపౌండ్‌కీ మరో స్ట్రాంగ్ కాంపౌండ్‌కీ మధ్య రచ్చ పీక్స్‌లోకి వెళ్ళిపోయింది సోషల్ మీడియా వేదికగా.. అదీ సినిమా అభిమానుల మధ్య. పైగా, రాజకీయాలు కూడా టచ్ అయ్యాయి ఇందులో.
విషయం వివాదాస్పదమయిన దరిమిలా, మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దూకారట. సోదరుడు నాగబాబుతో ఖండన ప్రకటన విడుదల చేశారట. పవన్ కళ్యాణ్, నాగబాబు రాజకీయాల్లో బిజీగా వున్న దరిమిలా, మొత్తం మెగా హీరోలందరి బాగోగులూ చిరంజీవి చూసుకోవాల్సి వస్తోందన్నది నిర్వివాదాంశం.
సినీ పరిశ్రమలో చిరంజీవి ‘అందరివాడు’గా వ్యవహరిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది తన కాంపౌండ్ నుంచే, లేకి మాటలు బయటకు రావడాన్ని చిరంజీవి అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట.
సరదాకే అయినా, సినీ రంగంలో ఇలాంటి కామెంట్లు మంచివి కాదనీ, రాజకీయంగానూ సమర్థనీయం కాదనీ, చిరంజీవి నాగబాబుతో చెప్పారట.