మెగా ఇంట్లో పెళ్లి సందడులు మొదలయ్యాయన్న సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు పెళ్లిళ్లు కాబోతోన్నాయి. మెగా డాటర్ నిహారిక పెళ్లి ఇప్పటికే ఫిక్స్ అయింది. అంగరంగ వైభవంగా నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. నిహారిక-చైతన్య పెళ్లి గురించి తాజాగా నాగబాబు ఓ ఇంటర్వ్యూలో అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. అయితే మామూలుగా వచ్చే ఏడాది పెళ్లి ఉండబోతోందని కామెంట్లు వినిపించాయి. కానీ తాజాగా వాటిపై ఓ క్లారిటీ వచ్చింది.
నిహారిక పెళ్లి విషయంలో తామెంతో సంతోషంగా ఉన్నామని నాగబాబు చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఎంతో క్లిష్టంగా మారిందని, ఇలాంటి కఠిన సమయం నుంచి కొంతవరకూ బయటకు వచ్చేలా కుటుంబంలో శుభకార్యం జరగడం ఎంతో ఆనందంగా అనిపిస్తోందని నిశ్చితార్థం గురించి చెప్పుకొచ్చాడు.
పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను వరుణ్‌తేజ్ చూసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. డిసెంబర్ నెలలో నిహారిక-చైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని అసలు విషయం చెప్పాడు. పెళ్లి తేదీని త్వరలోనే అందరికీ తెలియజేస్తాని తెలిపాడు. వెడ్డింగ్‌కు సంబంధించి వరుణ్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల పేర్లతో లిస్ట్ సిద్ధం చేశాడని అదిరిపోయే విషయాలను నాగబాబు తెలిపాడు. గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య మెగా అల్లుడు కాబోతోన్నాడన్న సంగతి తెలిసిందే.