ఉప్పల్‌లో జరిగిన కీలక మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. గుజరాత్ టైటాన్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో చిత్తయిన ఈ మ్యాచ్‌లో, హైదరాబాద్ టీం అన్ని విభాగాల్లో తేలిపోయింది. తొలుత బ్యాటింగ్‌లో విఫలమై, ఆ తర్వాత బౌలింగ్‌లో మరీంత మెరుగు చూపకపోవడం జట్టుకు తీవ్ర దెబ్బగా నిలిచింది.
మ్యాచ్ ప్రారంభంలో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్, మరోసారి స్థిరమైన ఆరంభాన్ని అందుకోలేకపోయింది. టాప్ ఆర్డర్ తుడిచిపెట్టుకుపోవడంతో మిడిల్ ఆర్డర్ పై భారం పడింది. నితీష్ కుమార్ రెడ్డి 31 పరుగులు, క్లాసెన్ 27 పరుగులతో కొంత ఆడినా, పెద్ద స్కోరు మట్టుకు కుదర్లేదు. చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 22 పరుగులు చేసి స్కోరు కాస్త మెరుగుపరచాడు. కానీ మహమ్మద్ సిరాజ్ వేసిన స్పెల్ (4 ఓవర్లలో 17 పరుగులు, 4 వికెట్లు) సన్‌రైజర్స్ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది.
152 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన గుజరాత్ టైటాన్స్, ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కానీ అనంతరం గిల్-సుందర్ జోడీ జట్టును కాపాడింది. వాషింగ్టన్ సుందర్ 49 పరుగులు చేసి గిల్‌కు అద్భుత భాగస్వామిగా నిలిచాడు. ఒక దశలో షమీ బౌలింగ్‌లో సుందర్ ఔట్ అయినా, రూథర్‌ఫోర్డ్ (23 నాటౌట్) వచ్చి గిల్‌కు బాగా సహకరించాడు. గిల్ 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌కి గెలుపు, ఓటమి కంటే ఎక్కువగా చర్చనీయాంశం అయినది సుందర్ ఔట్‌పై తీసిన అంపైర్ నిర్ణయం. బంతి నేల తాకిందా లేదా అన్నదానిపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ మ్యాచ్ మిగతా భాగం స్పష్టంగా గుజరాత్ ఆధిపత్యాన్ని సూచించింది. వరుసగా నాలుగు ఓటములతో ప్లే ఆఫ్స్ ఆశలు మరింత కష్టంగా మారిన సన్‌రైజర్స్ టీమ్, తిరిగి గెలుపు బాట పట్టాలంటే అన్ని విభాగాల్లో తిరిగి సమీక్ష అవసరం. మరోవైపు సిరాజ్ చెలరేగిన ఈ మ్యాచ్‌లో, “హైదరాబాద్ కుర్రాడు హైదరాబాద్‌కే శత్రువుగా మారిపోయాడా?” అనే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


