ట్రంప్ టారిఫ్ లకు భయపడేది లేదు.. రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్న ప్రధాని మోదీ..!

అమెరికా అదనపు సుంకాలతో వాణిజ్య యుద్ధానికి బీజం వేసిన మరుసటి రోజే… ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రైతుల కోసం నేను ఏదైనా తట్టుకుంటా. పశుపాలకులు, మత్స్యకారుల జీవితం మీద రాజీ లేదు అంటూ అమెరికాకు నేరుగా సంకేతం పంపారు. ఇది రెండు దేశాల మధ్య సాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల్లో కీలక మలుపు.

డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం భారతీయ వస్తువులపై అదనపు సుంకాలు విధించిన నేపథ్యంలో, ఇది కేవలం వాణిజ్య నిర్ణయం మాత్రమే కాదు, భారతదేశానికి విసిరిన ఓ సవాల్‌గానే ప్రభుత్వం చూస్తోంది. ముఖ్యంగా రష్యా ఆయిల్ దిగుమతులపై అమెరికా అసంతృప్తితో భారత్‌పై ఆర్థిక ఒత్తిడి పెడుతుండటాన్ని కేంద్రం తీవ్రంగా ఖండించింది.

ప్రధాని మోదీ మాట్లాడుతూ, రైతులు, పశుపాలకులు, మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో భారత్ ఎప్పటికీ రాజీ పడదు. వారి సంక్షేమం కోసం ఏదైనా ధర చెల్లించేందుకు సిద్ధం అని స్పష్టం చేశారు. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు అమెరికా విధించిన సుంకాలపై భారత విదేశాంగ శాఖ తీసుకున్న అధికారిక స్పందనతో ఇది గట్టిగా ప్రతిధ్వనిస్తోంది.

భారత విదేశాంగ శాఖ (MEA) ప్రకారం, అమెరికా తీసుకున్న తాజా నిర్ణయాలు విచారకరం, అన్యాయంగా ఉన్నాయని, ఇవి భారతదేశ జాతీయ ప్రయోజనాలను నేరుగా టార్గెట్ చేస్తున్నాయని తెలిపింది. భారత్ దిగుమతులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. దేశంలోని 1.4 బిలియన్ మంది ప్రజలకు ఎనర్జీ భద్రత అత్యవసరం అని వివరించింది. అంతేకాకుండా, అనేక దేశాలు రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకుంటున్నప్పటికీ, కేవలం భారత్‌ను టార్గెట్ చేయడం వివక్షాత్మకమని పేర్కొంది.

ఇక వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయంలో కూడా అమెరికా నుంచి పెరుగుతున్న ఒత్తిడి కనిపిస్తోంది. అమెరికా తన పాలు, మాంసం, జన్యుమార్పిడి పంటల వంటి ఉత్పత్తులకు భారత్ మార్కెట్లో ప్రాప్యత కోరుతోంది. అయితే భారత్ తన దేశీయ వ్యవసాయాన్ని, గ్రామీణ జీవనోపాధిని రక్షించడానికి స్పష్టంగా మద్దతుగా నిలుస్తోంది. ప్రత్యేకించి MSP (మినిమమ్ సపోర్ట్ ప్రైస్) వ్యవస్థపై ఆధారపడే దేశీయ వ్యవసాయం, విదేశీ పోటికి తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. ఆరోగ్య ప్రమాణాలు, జీవ వైవిధ్యం, రైతుల భద్రత వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకుంటూ భారత్ అమెరికా ఒత్తిడిని తిప్పికొడుతోంది.

ఒకవైపు వాణిజ్యలోపాలు, అటు వాణిజ్య పరస్పర విమర్శలు జరుగుతున్నా, రెండు దేశాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల లావాదేవీలు మాత్రం కొనసాగుతున్నాయి.
Indian Express నివేదిక ప్రకారం, USDA డేటా ఆధారంగా 2025 జనవరి నుండి జూన్ వరకు భారతదేశం అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను $1.69 బిలియన్‌కు పెంచింది. ఇది గతేడాది ఇదే కాలంలో ఉన్న $1.13 బిలియన్‌తో పోలిస్తే ఏకంగా 49.1% వృద్ధి. అదే సమయంలో భారత్ నుంచి అమెరికాకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు కూడా 24.1% పెరిగి $3.47 బిలియన్ కు చేరాయి. అంటే, వాణిజ్య ఉద్రిక్తతల మధ్య కూడా వృద్ధి సాగుతూనే ఉంది.

కానీ ఈ లెక్కల వెనుక రైతుల భవిష్యత్తు, వ్యవసాయ రంగ భద్రత అనే పెద్ద ప్రశ్న దాగి ఉంది. అంతర్జాతీయ ఒత్తిడుల మధ్యన, భారత్ తన రైతుల పక్షాన గట్టిగా నిలబడుతున్న దృక్పథం మరోసారి స్పష్టమైంది. మోదీ గళం, కేంద్ర ప్రభుత్వ స్థానం రెండూ ఈసారి నిష్పక్షపాతంగా కాకుండా, జాతీయ ప్రయోజనాల కోసం స్పష్టంగా ప్రతిఘటిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే, ఇది కేవలం రష్యా ఆయిల్ పై భారత్ వైఖరి కాదు… ఇది రైతుల జీవనోపాధిపై భారత్ పోరాటం. అటు అంతర్జాతీయంగా ఒత్తిడులు ఎదుర్కొంటూనే, ఇటు దేశీయంగా రైతులకు మద్దతుగా నిలవడం అనేది మోదీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా తీసుకుంటోందని తాజా వ్యాఖ్యలు స్పష్టంగా సూచిస్తున్నాయి.