ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమానికి అండగా నిలిచిన మెగాస్టార్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని పేరు ప్రఖ్యాతలు పొందిన మెగాస్టార్ చిరంజీవి కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బయట తన అభిమానులకు ఏ ఆపాద వచ్చిన నేనున్నాను అనే భరోసా కల్పిస్తూ ఉంటారు.ఎంతోమంది అభిమానులకు అండగా నిలిచి ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా, అనారోగ్యంతో బాధపడే ఎందరికో వైద్య చికిత్సలను అందించి ప్రాణాలను కాపాడారు. తాజాగా తన అభిమాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెంటనే స్పందించి ఆయనకు అండగా నిలిచారు.

కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన దొండపాటి చక్రధర్ మెగాస్టార్ చిరంజీవికి అభిమాని.ఈయన కూడా తన అభిమాన హీరో చిరంజీవి బాటలోనే పయనిస్తూ ఎంతోమందికి సహాయ సహకారాలు చేయడమే కాకుండా సమాజ సేవలో భాగమయ్యారు.ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే స్పందించి తనకు చేతనైన సహాయం చేస్తూ ఉంటారు. ఇలా అందరికీ సహాయ సహకారాలు చేసే చక్రధర్ క్యాన్సర్ బారిన పడ్డారు. గత కొంతకాలం నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్న ఈయన గురించి మెగాస్టార్ చిరంజీవికి తెలియడంతో వెంటనే రంగంలోకి దిగిన మెగాస్టార్ వెంటనే తనని హైదరాబాద్ కి రప్పించారు.

చక్రధర్ హైదరాబాద్ కి రప్పించి ఆయనకు ఒమేగా హాస్పిటల్ లో చేర్పించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.ఈ క్రమంలోనే అక్కడి డాక్టర్లతో మాట్లాడిన అనంతరం తనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించడమే కాకుండా క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదంటూ తన అభిమానికి వెన్ను తట్టి ధైర్యం చెప్పారు.ఇలా తన అభిమాన హీరో తన కోసం వచ్చి తనకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో చక్రధర్ ఎంతో ఎమోషనల్ అవుతూ మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేశారు.