మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ సినిమా.?

చిరంజీవి రాజకీయాల్ని వదిలేశారా.? లేదా.? ఈ విషయమై భిన్న వాదనలున్నాయి. ‘నేనైతే రాజకీయాల్ని వదిలేశాను. నన్ను మాత్రం రాజకీయాలు వదల్లేదు’ అంటారాయన. అదే విషయాన్ని ‘గాడ్ ఫాదర్’ సినిమాలోని ఓ డైలాగ్ ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఏమో, సమీప భవిష్యత్తులో నా తమ్ముడికి రాజకీయంగా మద్దతిస్తానేమో..’ అంటూ ఇంకో సందర్భంలో చిరంజీవి వ్యాఖ్యానించారు. ‘అన్నయ్యగా, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎదుగుదలను కోరుకుంటాను..’ అని మరో సందర్భంలో చిరంజీవి చెప్పడం తెలిసిన విషయమే.

ఆ సంగతి పక్కన పెడితే, త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోందిట. ఈ సినిమా విషయమై ప్రస్తుతం చర్చోపచర్చలు జరుగుతున్నాయి. టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ ఓ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నారట. అందులో వి.వి. వినాయక్‌ని ముఖ్యుడిగా చెబుతున్నారు.

ప్రస్తుత రాజకీయాలపై ఘాటైన విమర్శలు చేసేలా సినిమా వుంటుందన్నది ఓ ప్రచారం. అయితే, ఎవర్నీ నొప్పించక.. అత్యంత సున్నితంగా ప్రజల్ని ఆలోచింపజేసేలా సినిమా వుండొచ్చన్నది ఇంకో వాదన. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న ఈ సినిమా 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందర విడుదలయ్యేలా ప్లాన్ చేస్తారట.