అల్లు అర్జున్ నటించబోయే అట్లీ సినిమాకు సంబంధించి సంచలన సమాచారం ఫిల్మ్ సర్కిల్స్‌లో గట్టిగానే చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 తర్వాత బన్నీ కెరీర్‌కు మలుపుతిప్పేలా ఉండబోతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో ఊహించని మలుపు ఉంది. ఇప్పటివరకు డ్యూయల్ రోల్ అనే ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో, తాజాగా బన్నీ త్రిపాత్రాభినయంలో కనిపించనున్నాడన్న లీక్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. అందులోనూ ఒక పాత్ర నెగటివ్ షేడ్‌లో ఉండబోతోందని టాక్.
మూడు వేర్వేరు క్యారెక్టర్స్‌కి ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, స్టైల్, డైలాగ్ డెలివరీ ఉండేలా డిజైన్ చేస్తున్నారని సమాచారం. హీరోగా రెండు పాత్రలు మాస్, స్టైలిష్ కోణాల్లో ఉండగా, విలన్ పాత్ర మాత్రం అత్యంత పవర్ఫుల్ మైండ్ గేమ్ క్యారెక్టర్‌గా ఉండబోతుందట. అట్లీ సినిమాల్లో విలనిజానికి ప్రత్యేక స్థానం ఉండటం చూసినవారికైతే, ఇది బన్నీ మార్క్‌కి మరో మెట్టు అన్నట్టే. పైగా, హీరోనే విలన్ అనే ట్విస్ట్ ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించనుంది.
ఇంకా, సినిమా కథలో ముగ్గురు కథానాయికలు ఉంటారని బజ్. అందులో బాలీవుడ్ నుంచి దీపికా పదుకొణే ప్రధాన పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయట. మరో ఇద్దరిలో ఒకరు నేషనల్ రేంజ్ నటి కాగా, మరొకరు సౌత్ స్టార్ హీరోయిన్ అని సమాచారం. టెక్నికల్ టీమ్‌లో మ్యూజిక్ డైరెక్టర్, డీవోపీ ఎంపికపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అట్లీ మార్క్ మాస్ కంటెంట్‌కు బన్నీ నటనతో త్రిపాత్రాభినయం కలిస్తే, ఇది పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందని చెప్పవచ్చు.