గంగ‌వ్వ పొలంలో మొక్క‌లు నాటిన లాస్య‌.. వీడియో హ‌ల్‌చ‌ల్‌

ఈ ఏడాది బిగ్ బాస్ హౌజ్‌లో సంద‌డి చేసిన కంటెస్టెంట్స్ లాస్య‌, గంగ‌వ్వ‌. గంగ‌వ్వ అనారోగ్యంతో బిగ్ బాస్ హౌజ్‌ని వీడగా, లాస్య‌కు త‌క్కువ ఓట్స్ రావ‌డంతో ఎలిమినేట్ కావ‌ల‌సి వ‌చ్చింది. అయితే 58ఏళ్ల గంగ‌వ్వ బిగ్ బాస్ హౌజ్‌లో చేసిన సంద‌డి అంతా ఇంతాకాదు. ప‌ల్లెటూరులో న‌లుగురితో ముచ్చ‌టించుకుంటూ ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగే గంగ‌వ్వ‌ని తీసుకెళ్లి నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉంచే స‌రికి ఆమెకు ఆరోగ్యం ఏదోలా అయిపోయింది. కొద్ది వారాల‌కే ఇంటి బాట ప‌ట్టింది. అయితే ఉన్న‌న్ని రోజులు బిగ్ బాస్ హౌజ్‌ని మాత్రం ఓ ఊపు ఊపేసి వెళ్లింది.

 

ఎలాంటి అంచ‌నాలు లేకుండా బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన గంగ‌వ్వ అంద‌రితో క‌లివిడిగా ఉంది. వారికి సూచ‌న‌లు ఇస్తూ అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది. టాస్క్‌ల‌లోను త‌న వంతు ప్ర‌తిభ క‌న‌బ‌రిచింది. వయసు పైబడడం వలన బిగ్ బాస్ హౌస్ లో ఇమడలేకపోయిన గంగవ్వ ఐదవ వారం స్వయంగా ఇంటి నుండి బయటకు వచ్చింది. లంబాడిప‌ల్లిలో త‌న వాళ్లంద‌రిని క‌లిసిన త‌ర్వాత కొంత ఆరోగ్యం కుదుట ప‌డింది. అనంత‌రం జోర్దార్ సుజాత‌తో క‌లిసి సంద‌డి చేసింది. ప‌లు షోస్ కూడా చేస్తుంది.

ఇక ఇప్పుడు లాస్య‌తో క‌లిసి సంద‌డి చేసింది గంగ‌వ్వ‌. రీసెంట్‌గా త‌న భ‌ర్త‌తో క‌లిసి లాస్య.. గంగ‌వ్వ ఊరు వెళ్లి ఆమెను క‌లిసింది. ఆమెలానే చీర‌క‌ట్టు ధ‌రించి ఊర్లో తిరుగుతూ ర‌చ్చ చేసింది. అంతేకాదు ఆమె ఇంట భోజనం చేశాక పొలాల్లో తిరుగుతూ నాట్లు వేయ‌డం, క‌ళ్ల జోడు పెట్టుకొని హ‌ల్ చ‌ల్ చేయ‌డం వంటివి చేశారు. వీటికి సంబంధించిన వీడియోల‌ని లాస్య త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక లాస్య‌..గంగ‌వ్వ‌ని ఓ ప్ర‌శ్న అడిగింది. టాప్ 5లో ఉన్న అఖిల్, అభిజీత్, అరియానా, సోహైల్, హారిక‌ల‌లో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు అని అడ‌గగా వారంద‌రు నాకిష్టం. ఎవ‌రు గెలిచిన సంతోష‌మే అని పేర్కొంది.