దీపావళి కానుకగా విడుదలైన కిరణ్ అబ్బవరం సినిమా క మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. చింతా గోపాలకృష్ణ నిర్మాతగా సుజిత్, సందీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరో కాగా తన్విరాం నాయన సారిక హీరోయిన్లుగా నటించారు. 50 కోట్లకు పైగా వసూలు రాబట్టిన ఈ సినిమా నవంబర్ 28 నుంచి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక్కరోజులోనే ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో ఓటీటీ లో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు, మా నమ్మకాన్ని మించి పెద్ద విజయాన్ని అందించారు. తెలుగులో డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ లో ఓటీటీ లో వచ్చిన తొలి సినిమా మాదే, అందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పాడు. అంతేకాక నిర్మాత చింత గోపాలకృష్ణ బడ్జెట్ పరంగా ఎక్కడ వెనుకడుగు వేయలేదని అతని సహకారాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాడు కిరణ్ అబ్బవరం.
అయితే క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా విజయం సాధించకపోతే నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను అని పేర్కొన్న వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అదే విషయంగా ఒక రిపోర్టర్ కిరణ్ అబ్బవరం ని ఈ సినిమా హిట్ అవ్వకపోతే మీరు నిజంగానే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయేవారు అని ప్రశ్నించగా నేను మాట మీద నిలబడే వ్యక్తిని అని సమాధానం ఇచ్చి తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నాడు కిరణ్ అబ్బవరం.
తొలి చిత్రం రాజావారు రాణి గారు సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. అయితే క సినిమా కిరణ్ అబ్బవరం కెరియర్ లో ఒక మైలురాయి గా నిలిచిపోయింది. ఈ సినిమాతో అతను పాన్ ఇండియా స్టార్ అయిపోయాడటంలో ఏమాత్రం సందేహం లేదు.