8 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి కరుణ్ నాయర్.. అరుదైన ఘనత..!

టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. కానీ ఈసారి కరుణ్ నాయర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. కారణం స్కోరు కాదు, రీఎంట్రీ. భారత టెస్టు జట్టులో దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ అడుగుపెట్టిన ఆటగాడిగా కరుణ్ నాయర్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 402 మ్యాచ్‌ల విరామం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన మొట్టమొదటి ఆటగాడు అనే ఘనత అతని ఖాతాలో చేరింది.

2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ తరువాత భారత జట్టులో చోటు కోల్పోయిన కరుణ్… అప్పటి నుంచి తుది జట్టులో ఆడేందుకు ఎదురుచూశాడు. దేశవాళీ క్రికెట్‌లో ఏదో ఒక చోట మంచి ప్రదర్శన చూపుతూ వచ్చినప్పటికీ, జాతీయ జట్టుకు మాత్రం చోటు దక్కలేదు. మధ్యలో 2018 ఇంగ్లండ్ పర్యటనకు సెలెక్షన్ అయినా.. ఆడే అవకాశం రాలేదు. చివరి మ్యాచ్‌లో అవకాశం ఉండగా హనుమ విహారికి ప్రాధాన్యం ఇచ్చారు. అలా టీమిండియా జెర్సీ మరోసారి వేసుకునే ఛాన్స్ కరుణ్‌కు దాదాపు దూరమయ్యింది.

అయితే ఇటీవల సీనియర్ల రిటైర్మెంట్ కారణంగా జట్టులో ఖాళీ ఏర్పడింది. అంతకుముందే దేశవాళీ పోటీల్లో కరుణ్ ఫామ్‌కు వచ్చేయడం కలిసి వచ్చాయి. దీంతో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కరుణ్ నాయర్‌ను ఎంపిక చేశారు సెలెక్టర్లు. లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టుతో మళ్లీ భారత జట్టులోకి ప్రవేశించాడు. దాంతో మొత్తం 8 సంవత్సరాలు 84 రోజులు గడిచిన తర్వాత, 402 అంతర్జాతీయ మ్యాచ్‌ల విరామం తర్వాత కరుణ్‌ మళ్లీ భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఈ ఘనతను ఇప్పటి వరకు ఎవరూ సాధించలేరు.

ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు రయద్ ఎమ్రిట్ పే ఉంది. అతను 396 మ్యాచ్‌లు, 10 ఏళ్ల 337 రోజుల తర్వాత జట్టులోకి వచ్చినవాడు. ఇంగ్లండ్‌కు చెందిన జో డెన్లీ (384 మ్యాచ్‌లు), శ్రీలంక ఆటగాడు మహేళ ఉదవట్టే (374 మ్యాచ్‌లు) కూడా రీఎంట్రీ ఇచ్చారు. కానీ నాయర్ వారందరినీ దాటేశాడు. ఒకప్పుడు ట్రిపుల్ సెంచరీతో అభిమానుల హృదయాల్లో నిలిచిన నాయర్.. ఆ తర్వాతే తన కెరీర్ కుదేలవడం విషాదం. 2016లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ బాదిన కరుణ్, సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన భారత బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. కానీ ఆ అనంతరం వరుస పరాజయాలు, అవకాశాల కొరత కారణంగా అతడి కెరీర్ నెమ్మదించిపోయింది.

ఇప్పుడు మళ్లీ జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ తొలి ఇన్నింగ్స్‌లోనే డకౌట్ అయినా, అతడి రాబోయే ప్రదర్శనపై ఆసక్తిగా ఉంది. ఎందుకంటే, ఒకసారి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడు మళ్లీ తాను ఎందుకు విలువైనవాడినో నిరూపించుకోవడానికి ఇది మంచి వేదిక.. ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశం ఆయన ప్రయోజనంగా మలచుకోగలడేమో చూడాలి.