ఈ ఏడాది సినీ పరిశ్రమకు ఏ మాత్రం కలిసి రాలేదు. కరోనా వలన థియేటర్స్ మూతపడడం, షూటింగ్స్ అన్నీ ఆగిపోవడంతో సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. కొందరైతే పొట్టకూటి కోసం బిక్షమెత్తుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. అంతలా నష్టపోయిన ఇండస్ట్రీకి దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఒకవైపు కరోనాతో అందరు నానా ఇబ్బందులు పడుతుంటే మరో వైపు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు లేదంటే వారి కుటుంబ సభ్యులు కన్నుమూయడం ప్రతి ఒక్కరికి కంట కన్నీరు పెట్టిస్తుంది. కరోనా వలన ఇప్పటికీ ఎంత మంది మరణించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనారోగ్యంతోను చాలా మంది తుదిశ్వాస విడిచారు.
ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 40కి పైగా సెలబ్రిటీలు కన్నుమూశారు. వారి మరణం ఇండస్ట్రీకి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇక తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తల్లి కరీమా బేగం కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం చెన్నైలోని తన ఇంట్లో కన్నుమూశారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వార్తను రెహమాన్ ట్విటర్‌లో తన తల్లి ఫొటో పోస్ట్ చేస్తూ తెలియజేశారు
కరీమా బేగమ్.. 1976లో మృతి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్కే శేఖర్ భార్య. ఈ దంపతులకు రెహమాన్ ఒక్కడే కొడుకు. ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తల్లిని ఎంతో ప్రాణంగా ప్రేమించే రెహమాన్‌కు ఆమె తల్లి మరణించడం తీరని లోటు. రెహమాన్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. అలానే రెహమాన్‌తో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కరోనా వలన ఈ రోజే ఆమె అంత్యక్రియలు కొద్ది మద్ది సమక్షంలో నిర్వహించనున్నారు.